‘Toxic’ Movie Controversy: పాన్ ఇండియా స్టార్ రాకింగ్ స్టార్ యశ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తాజా యాక్షన్ చిత్రం 'టాక్సిక్'. అయితే ఈ సినిమా విడుదల సమయంలోనే ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. సినిమాపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, నెగెటివ్ ట్రోల్స్‌పై చిత్ర యూనిట్ సీరియస్ అయింది.

సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో తప్పుడు, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం,షేర్ చేయడాన్ని నిషేధిస్తూ బెంగళూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 'టాక్సిక్' చిత్ర నిర్మాణ సంస్థ అయిన 'కేవీఎన్ ప్రొడక్షన్స్' దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన అదనపు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రముఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) సంస్థతో పాటు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కోర్టు ఈ ఆంక్షలు విధించింది. సినిమాకు సంబంధించి ఎలాంటి తప్పుడు వార్తలను, కించపరిచే అంశాలను ఏ సోషల్ మీడియా వేదికపైనా పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, లేదా షేర్ చేయడం చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ మధ్యంతర ఉత్తర్వులు తదుపరి విచారణ జరిగే సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని న్యాయస్థానం తెలిపింది. అయితే, ఈ ఉత్తర్వులను వేరే ఇతర ప్రయోజనాల కోసం వాడుకోకూడదని హెచ్చరించింది. ఒకవేళ కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఈ ఉత్తర్వులను రద్దు చేస్తామని కోర్టు స్పష్టం చేసింది.

Tags: