Actor Anant Nag: ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2024 దక్కనుంది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందజేయనున్నారు. గుజరాత్‌లో సెప్టెంబర్ 22, 2026న జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమంలో అనంత్ నాగ్‌కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు.

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎన్నో దశాబ్దాలుగా అనంత్ నాగ్ తన సహజమైన నటన, విభిన్న పాత్రలు, అద్భుతమైన ప్రతిభతో భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ సినిమాపై తనదైన ముద్ర వేశారని మోదీ పేర్కొన్నారు.

అనంత్ నాగ్ ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు ప్రత్యేకమైన లోతు, సహజత్వాన్ని తీసుకొచ్చేవారని ప్రధాని అన్నారు. ఎంతో ప్రతిభ కలిగిన కళాకారుడికి దక్కిన ఈ గౌరవం పూర్తిగా సముచితమైనదని పేర్కొంటూ ఆయన అభినందనలు తెలిపారు.

అనంత్ నాగ్ తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకు 300కు పైగా సినిమాల్లో నటించారు. ఇందులో 250కి పైగా సినిమాలు కన్నడలోనే ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా కన్నడ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పటి తరం ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

ముఖ్యంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమాల్లో అనంత్ నాగ్ పోషించిన పాత్రతో కొత్త తరం ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది.

కన్నడ సినిమాలతో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అనంత్ నాగ్ ఇతర భాషల్లోనూ నటించారు. తెలుగులో నితిన్ హీరోగా నటించిన భీష్మ సినిమాలో కనిపించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రాత్రి సినిమాలోనూ నటించారు.

దశాబ్దాలుగా భారతీయ సినీ రంగంలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనంత్ నాగ్‌కు ఇప్పుడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడం ఆయన సినీ ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టంగా నిలిచింది.

Tags: