Vishwak Sen: హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో యంగ్ హీరో విశ్వక్ సేన్ అభిమానుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫొటో సెషన్ తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం కల్ట్ అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఫ్యాన్ మీట్‌ను నిర్వహించారు. అయితే ఊహించని రీతిలో వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని నియంత్రించలేక నిర్వాహకులు చేతులెత్తేయడంతో ఈ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా నిలిపివేయాల్సి వచ్చింది.

అదుపు తప్పిన రద్దీ.. తప్పని నిరాశ

తమ అభిమాన కథానాయకుడిని నేరుగా కలిసి ఫొటో దిగేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు స్టూడియో ప్రాంగణానికి చేరుకున్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి రద్దీ పెరిగిపోవడంతో తోపులాట చోటుచేసుకుంది. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉండటం, భద్రతాపరమైన సమస్యలు తలెత్తడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విశ్వక్ సేన్ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు తీవ్ర అసహనం, నిరాశకు గురయ్యారు.

సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ భావోద్వేగ ప్రకటన

కార్యక్రమం అర్ధాంతరంగా రద్దు కావడంతో విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. "ఫ్యాన్స్‌తో ఫొటో సెషన్ సందర్భంగా మీకు కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను. నాతో ఫొటో దిగాలని ఎంతో దూరం నుంచి వచ్చి, అవకాశం దక్కక నిరాశతో వెనుదిరిగిన ప్రతి అభిమానికి సారీ. మీ అందరినీ వ్యక్తిగతంగా పలకరించలేకపోయినందుకు తీవ్రంగా బాధపడుతున్నాను" అంటూ విచారం వ్యక్తం చేశారు.

అభిమానులు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన విశ్వక్ సేన్, భవిష్యత్తులో ఎవరికీ ఇబ్బంది కలగకుండా మరింత పటిష్ఠమైన భద్రత, మెరుగైన ఏర్పాట్లతో అతి త్వరలోనే మరొక ఫ్యాన్ మీట్‌ను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

Tags: