Amitabh and Abhishek: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లను చంపేస్తామంటూ గ్యాంగ్‌స్టర్ గోల్డీ థిల్లాన్ నుంచి బెదిరింపులు రావడం సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల ఢిల్లీ పోలీసుల చేతికి చిక్కిన తన ఇద్దరు అనుచరుల అరెస్టులతో మేము ఆగిపోమని, ముంబైలో ఇంకా 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారంటూ గోల్డీ థిల్లాన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టాడు. సిక్కులకు వ్యతిరేకంగా మాట్లాడే ఎవరినీ తాను వదిలిపెట్టనంటూ హెచ్చరికలు చేసిన ధిల్లాన్.. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల పేర్లను ప్రస్తావించారు.

వారు ఎంతటి భద్రతా ఏర్పాట్లు చేసుకున్నా తమ నుంచి తప్పించుకోలేరని, బుల్లెట్ ప్రూఫ్ క్యాబిన్లు ఏర్పాటు చేసుకున్నా కాల్చి చంపుతామని అన్నారు. అమితాబ్, అభిషేక్‌లను నేరుగా లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలకు కొద్ది రోజుల ముందే ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్న ఇద్దరు అనుమానిత షూటర్లను అరెస్టు చేసింది. వీరిని వికాస్ ఠాకూర్ అలియాస్ విక్కీ, దీపక్ సింగ్ అలియాస్ దీప్‌గా గుర్తించారు.

వీరిద్దరూ వేర్వేరు దాడుల్లోను భాగస్వాములై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్తపై కాల్పుల కుట్రతో పాటు, ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా వద్ద దాడికి ఫ్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రతి ఆదివారం తన ఇంటి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేయడం అమితాబ్ బచ్చన్‌కు ఎన్నో ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవల ఆయన అభిమానులను పలకరించే సమయంలో బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ మధ్య కనిపించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆపై ఈ మధ్యే అక్టోబర్ 23, నవంబర్ 6, నవంబర్ 12 తేదీల్లో పలుమార్లు జల్సా బంగ్లాకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ పఠిష్ట బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికే సల్మాన్ ఖాన్‌కు తరచూ బెదిరింపులు, దాడుల వ్యవహారం అలా ఉండగానే ఇప్పుడు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌ల విషయంలోనూ జరుగుతుండడంతో బాలీవుడ్‌కు నిద్ర కరువయింది. అయితే గోల్డీ థిల్లాన్ సోషల్ మీడియా పోస్టులో చేసిన ప్రకటనలు, ముంబైలో 200 మంది అనుచరులు సిద్ధంగా ఉన్నారన్న బెదిరింపులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

గ్యాంగ్‌స్టర్ గోల్డీ థిల్లాన్ స్పెయిన్‌లో ఉన్నట్లు నమ్ముతున్నారు. అతని పోస్టు బాలీవుడ్‌లో భద్రతా ఆందోళనలను పెంచింది. అమితాబ్ బచ్చన్ జల్సా నివాసంలో అధిక భద్రతా ఏర్పాట్లు చేయడం, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్‌లు ఉపయోగించడం ఈ బెదిరింపుల నేపథ్యంలో జరిగినట్లు అంచనా. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో సంబంధాలు ఉన్న అనుచరుల అరెస్టు ఈ విషయానికి మరింత తీవ్రతను ఇచ్చింది. పోలీసులు ఈ బెదిరింపులపై దర్యాప్తు చేస్తున్నారని, సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌లో స్టార్లపై గ్యాంగ్‌స్టర్ల బెదిరింపులు కొత్త కాదు. అయితే అమితాబ్ బచ్చన్ వంటి సీనియర్ నటుడిపై నేరుగా హెచ్చరిక చేయడం పరిశ్రమను ఆందోళనకు గురి చేస్తోంది. అభిషేక్ బచ్చన్‌పై కూడా బెదిరింపు రావడం తండ్రీకొడుకుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ కావడంతో ప్రజలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు త్వరలోనే చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు.

Tags: