Anasuya: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ తన తండ్రి మరణించిన మూడేళ్ల తర్వాత తనను నిరంతరం తొలిచేస్తున్న ఒక ప్రశ్నకు సోషల్ మీడియా వేదికగా సమాధానం కోరారు. తన తండ్రి మరణం తర్వాత తల్లి జీవితంలో వచ్చిన మార్పులను, ముఖ్యంగా విధవరాళ్లపట్ల సమాజం చూపే ఆంక్షలను ఉద్దేశించి ఆమె తీవ్రంగా స్పందించారు.

తన తండ్రి మూడేళ్ల క్రితం మరణించారని, ఆ తర్వాత తమ కుటుంబ జీవితం పూర్తిగా మారిపోయిందని అనసూయ గుర్తు చేసుకున్నారు. "మా అమ్మ చిన్నప్పటి నుంచి కాటుక, బొట్టు, రంగురంగుల గాజులు మరియు గజ్జెలు ధరించి ఎంతో నిండుగా, అందంగా కనిపించేది. కానీ నాన్న చనిపోయిన తర్వాత సమాజం విధించిన ఆంక్షల వల్ల అమ్మ అవన్నీ వేసుకోవడం మానేసింది. అది చూసి నేను చాలా బాధపడ్డాను. నాలాంటి భావాలనే చాలామంది మహిళలు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను" అని ఆమె అన్నారు.

భర్త మరణించిన తర్వాత మహిళలు సంప్రదాయ అలంకారాలకు దూరంగా ఉండాలనే పద్ధతిని ఆమె సూటిగా ప్రశ్నించారు. "చిన్నతనంలో బొట్టు, గాజులు, గజ్జెలు మనకు పరిచయం చేసింది అమ్మ లేదా అమ్మమ్మ. ఒకవేళ ఆ అలంకరణను వదిలేయాల్సి వస్తే, ఆ సంప్రదాయాన్ని పరిచయం చేసిన అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా వదిలేయాలి? అలంకరణలన్నింటినీ భర్తతోనే ఎందుకు ముడిపెడతారు? బొట్టు పెట్టుకోవాలా వద్దా, గాజులు వేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం కాదా?" అని అనసూయ నిలదీశారు.

అంతేకాకుండా పూజా కార్యక్రమాలు, పండుగలు మరియు శుభకార్యాల సమయంలో మహిళలపై రుద్దే కొన్ని బలవంతపు ఆంక్షలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చకు దారితీశాయి.

Tags: