Producer SKN: గుర్తింపు ఇచ్చిన ఇండస్ట్రీనే కించపరుస్తారా? నటీనటుల తీరుపై నిర్మాత ఎస్కేఎన్ ఆగ్రహం..
నిర్మాత ఎస్కేఎన్ ఆగ్రహం..
Producer SKN: దక్షిణాది చిత్ర పరిశ్రమ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ఆ తర్వాత అదే పరిశ్రమను కించపరిచేలా వ్యవహరిస్తున్న కొందరు నటీనటుల తీరుపై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పెట్టిన సుదీర్ఘ పోస్ట్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఆదరించిన ఇండస్ట్రీపైనే విమర్శలు గుప్పించే సంస్కృతి సరైంది కాదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవంతో పరిశ్రమను నిశితంగా గమనిస్తున్నానని పేర్కొన్న ఎస్కేఎన్, ఈ మధ్యకాలంలో కొందరు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాదిలో, ప్రత్యేకించి టాలీవుడ్లో దక్కిన అవకాశాలను అందిపుచ్చుకుని, ప్రేక్షకుల ఆదరణతో స్టార్డమ్ సొంతం చేసుకున్న తర్వాత.. కొన్నేళ్లకు ఇక్కడి కథలు, సంస్కృతి, సంప్రదాయాలను తక్కువ చేసి మాట్లాడటం కొందరికి పరిపాటిగా మారిందని ఆయన దుయ్యబట్టారు.
నటీనటులకు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉంటుందన్న విషయాన్ని తాను అంగీకరిస్తానని చెబుతూనే, హితకరమైన విమర్శలకు, ఇండస్ట్రీని కించపరిచే ధోరణికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని ఎస్కేఎన్ స్పష్టం చేశారు. దక్షిణాది సినిమాలకు, తెలుగు చిత్రసీమకు కథలు చెప్పే విధానంలో ఒక విలక్షణమైన గుర్తింపు, బలమైన సాంస్కృతిక నేపథ్యం, ప్రత్యేకమైన విలువలు ఉన్నాయని గుర్తుచేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చేవారికి ఇక్కడి కథన శైలి భిన్నంగా అనిపించవచ్చేమో గానీ, ఇక్కడి సంస్కృతిలో అదొక సహజమైన భాగమని ఆయన వివరించారు.
గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకున్నప్పుడే నిలుస్తుందని పేర్కొన్న నిర్మాత, ఇక్కడి అవకాశాలు, గుర్తింపును ఎంచక్కా అనుభవించి.. అనంతరం మన సాంస్కృతిక మూలాలను చిన్నచూపు చూడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. నిర్మాణాత్మకమైన సలహాలు, విమర్శలను పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని, అంతేకానీ సాంస్కృతిక ఆధిపత్య ధోరణితో చేసే విమర్శలను ఎవరూ సహించబోరని తేల్చిచెప్పారు. మనల్ని నిలబెట్టిన పరిశ్రమను, ఆదరించిన సంస్కృతిని గౌరవించడం నేర్చుకోవాలంటూ ఎస్కేఎన్ సున్నితంగానే చురకలంటించారు.