Tara Sutaria: యశ్ మేల్ ఫెమినిస్ట్ .. తారా సుతారియా ఆసక్తికర వ్యాఖ్యలు
ఆసక్తికర వ్యాఖ్యలు
Tara Sutaria: యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టాక్సిక్’ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాలో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ భామ తారా సుతారియా తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో యశ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
సినిమాలో యశ్ పోషించిన పాత్రకు, నిజ జీవితంలో ఆయన వ్యక్తిత్వానికి చాలా తేడా ఉంటుందని తారా సుతారియా వెల్లడించారు. ముఖ్యంగా యశ్‌ను ‘మేల్ ఫెమినిస్ట్’ అని పిలవొచ్చా అనే ప్రశ్నకు ఆమె.. కచ్చితంగా పిలవచ్చంటూ సమాధానం ఇచ్చారు.
యశ్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని.. తన గురించి కంటే ఎదుటివారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారని తారా చెప్పారు. సినీ పరిశ్రమలో ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారని, ఆయన ప్రతి ఒక్కరినీ ఎంతో గౌరవంగా చూస్తారని ప్రశంసించారు.
ఇక సోషల్ మీడియాలో హీరోయిన్లను ఒకరితో మరొకరిని పోల్చడంపైనా తారా సుతారియా అసహనం వ్యక్తం చేశారు. ఎప్పుడూ హీరోయిన్లను పోల్చుతుంటారని.. కానీ పురుష నటులను అదే విధంగా ఎందుకు పోల్చరని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ప్రతి నటికి తనకంటూ ఓ ప్రత్యేకత ఉంటుందని, ఒక్కొక్కరు ఒక్కో రకమైన పాత్రలకు సరిపోతారని అన్నారు. అలాంటప్పుడు హీరోయిన్ల మధ్య పోలికలు ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు.
కాగా.. ‘కేజీఎఫ్-2’ తర్వాత దాదాపు నాలుగేళ్ల విరామం తీసుకున్న యశ్.. ‘టాక్సిక్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో నయనతార, కియారా అడ్వాణీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణీ వసంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ నెల 26న థియేటర్లలో విడుదలైన ‘టాక్సిక్’పై మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. తారా సుతారియా చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.