Yash: హీరోల స్టార్డమ్, నిర్మాతల వాటాపై యశ్ సంచలన వ్యాఖ్యలు.. అల్లు అరవింద్ కామెంట్స్‌కు కౌంటర్..!
అల్లు అరవింద్ కామెంట్స్‌కు కౌంటర్..!
Yash: కేజీఎఫ్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన కన్నడ హీరో యశ్, ప్రస్తుతం తన తాజా చిత్రం టాక్సిక్ ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో హీరోల గుర్తింపు, నిర్మాత పాత్ర, సినిమా విజయానికి గల కారణాలపై ఆయన స్పష్టమైన అభిప్రాయాలను పంచుకున్నారు. గతంలో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యాన్ని గుర్తుచేస్తూ యశ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.
సినిమా విజయం ఒక్కరి సొంతం కాదు
ఒక సినిమా సాధించే విజయం లేదా క్రెడిట్ కేవలం నిర్మాతకే చెందుతుందనే వాదనను యశ్ తోసిపుచ్చారు. కేజీఎఫ్ తన కెరీర్‌ను మలుపు తిప్పిందనేది ఎంత వాస్తవమో, ఆ విజయం వెనుక ఉన్న టీమ్‌వర్క్ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు. ‘‘రచయితల నుంచి సహాయ నటీనటులు, సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ కష్టపడితేనే సరైన అవుట్‌పుట్ వస్తుంది. లీడ్ రోల్‌లో నటించే నటుడు న్యాయం చేయలేకపోతే ఎంత ఖర్చు పెట్టి తీసినా సినిమా ప్రేక్షకాదరణ పొందలేదు. ఎవరిని ఆదరించాలి, ఎవరికి ఎంత గుర్తింపు ఇవ్వాలనేది ఆడియన్స్‌కు బాగా తెలుసు. కొన్నిసార్లు హీరోలకే ఎక్కువ క్రేజ్ రావడంపై ఆశ్చర్యం కలిగినా, ప్రేక్షకుల నిర్ణయం ఎప్పుడూ తప్పదు’’ అని యశ్ అన్నారు.
శుక్రవారమే స్టార్‌డమ్‌ను నిర్ణయిస్తుంది
సినిమా రంగంలో నిన్నటి విజయం రేపటికి గ్యారెంటీ కాదని యశ్ అన్నారు. ఎంతటి స్టార్ హీరోకైనా విడుదలయ్యే శుక్రవారమే తలరాతను మారుస్తుందని, బాక్సాఫీస్ వద్ద ఫలితం తేడా కొడితే ఆ పాన్-ఇండియా ఇమేజ్ క్షణాల్లో ఆవిరైపోతుందని కుండబద్దలు కొట్టారు. గతంలో ఓ వేడుకలో అల్లు అరవింద్ మాట్లాడుతూ.. భారీ బడ్జెట్, మేకింగ్ వల్లే కేజీఎఫ్ అంతటి విజయం సాధించిందని, ఆ చిత్రానికి ముందు యశ్ ఎవరికి తెలుసని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.