Sri Padmavathi Ammavari Pavitrotsavams: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వ‌హించారు. ఆలయంలో సెప్టెంబరు 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి.

ఈ ఉత్సవాలకు సాయంత్రం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్ర‌హణం,సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం, ప‌విత్ర అధివశం నిర్వ‌హించారు.

ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలియక జరిగిన దోషాల నివారణకు ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 24వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 25న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 26న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు. భ‌క్తులు ఒక్కొక్క‌రు రూ.750/- చెల్లించి ఒక‌రోజు ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో జేఈవో డా ఎ శరత్, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హరింద్ర నాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ లు శ్రీ రమేష్, శ్రీ చెంగల్రాయులు, ఆలయ ఇన్స్పెక్టర్ లు శ్రీ చలపతి, లక్ష్మీకాంతం, ఆలయ అర్చ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.