Ashadha Amavasya: ఆషాఢ అమావాస్య.. భౌమవతి యోగం ప్రత్యేకతలేంటి? ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
ఏం చేయకూడదు?
Ashadha Amavasya: సనాతన ధర్మంలో ప్రతి నెలా వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక, ధార్మిక ప్రాధాన్యత ఉంది. అయితే అన్ని అమావాస్యల్లో కెల్లా ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యను అత్యంత శక్తివంతమైనదిగా, పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది ఆషాఢ అమావాస్య జూలై 14న వచ్చింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ రోజు ఒక అరుదైన, విశేషమైన యోగం ఏర్పడటంతో ఈ అమావాస్యకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పవిత్ర దినం యొక్క విశిష్టత, పాటించాల్సిన నియమాలు, పూజా విధానాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
భౌమవతి అమావాస్య అరుదైన సంయోగం..
సాధారణంగా అమావాస్య తిథి వచ్చే వారాన్ని బట్టి దానికి కొన్ని ప్రత్యేక పేర్లు వస్తాయి. సోమవారం వస్తే సోమవతి అమావాస్య అని, మంగళవారం వస్తే భౌమవతి అమావాస్య అని పిలుస్తారు. ఈ ఏడాది జూలై 14వ తేదీ మంగళవారం కావడం వల్ల దీనిని భౌమవతి అమావాస్యగా జరుపుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని భూమి పుత్రుడు లేదా భౌముడు అని పిలుస్తారు. అందువల్ల ఈ రోజున చేసే ఆరాధనలకు రెట్టింపు ఫలితం ఉంటుంది. ముఖ్యంగా జాతకంలో మంగళ దోషం ఉన్నవారు, తీవ్రమైన అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు ఈ రోజున పరిహారాలు చేసుకోవడం వల్ల శుభె ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.
పితృ తర్పణాలు - శ్రాద్ధ కర్మల ప్రాధాన్యత..
మన నుంచి దూరమైన పూర్వీకులను స్మరించుకోవడానికి, వారి ఆశీస్సులు పొందడానికి ఆషాఢ అమావాస్య అత్యంత ప్రశస్తమైన రోజు. ఈ రోజున పవిత్ర నదులలో లేదా జలాశయాల వద్ద పితృ దేవతలకు తర్పణాలు ఇవ్వడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది. ఇది కుటుంబంలో ఉన్న పితృ దోషాలను తొలగించి, వంశాభివృద్ధి, ధనలాభం మరియు ఇంట్లో ప్రశాంతతను చేకూరుస్తుందని నమ్ముతారు.
గోపూజతో కర్మ ఫలాల నివారణ:
ఈ పవిత్రమైన రోజున గోసేవ చేయడం వల్ల కోటి పుణ్యాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయాన్నే లేవగానే గోదర్శనం చేసుకోవడం, ఆవుకు పచ్చిగడ్డి, బెల్లం లేదా గ్రాసం తినిపించడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ఆవులో 33 కోట్ల దేవతలు నివసిస్తారని మన నమ్మకం కాబట్టి, ఈ రోజున గోసేవ చేయడం వల్ల పూర్వజన్మల పాప కర్మలు తొలగిపోయి దేవతల అనుగ్రహం లభిస్తుంది.
గురు గ్రహ అస్తమయం - ధార్మిక నియమాలు..
ఈ బారిన ఆషాఢ అమావాస్య నాడే మరో ప్రధాన జ్యోతిష్య మార్పు చోటుచేసుకుంటోంది. దేవగురువైన బృహస్పతి ఈ రోజే అస్తమిస్తున్నాడు. ఈ గురు అస్తమయ స్థితి ఆగస్టు 12 వరకు కొనసాగుతుంది. శాస్త్రాల ప్రకారం, గురు అస్తమయ కాలంలో వివాహాలు, గృహప్రవేశాలు వంటి ఎలాంటి శుభ మరియు మాంగళిక కార్యాలు చేయకూడదు. అయితే ఈ సమయం జపం, తపం, మంత్ర సాధన, ధ్యానం మరియు దానధర్మాల వంటి ఆధ్యాత్మిక కార్యాలకు బంగారు లాంటి అవకాశంగా పరిగణించబడుతుంది.
ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పూజలు..
ఉదయాన్నే లేచి స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం వేసుకుని పవిత్ర స్నానం చేయాలి.
ఆ తర్వాత పేదలకు లేదా అవసరార్థులకు అన్నదానం చేయడం, వస్త్రాలు లేదా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల కర్మ దోషాలు తొలగిపోతాయి.
ఇది మంగళవారం నాటి అమావాస్య కాబట్టి, ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంగళ దోషాలు, అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది.
ఆహార నియమాలు..
అమావాస్య రోజున మన శరీరం మరియు మనస్సు ప్రశాంతంగా, తేలికగా ఉండటం ముఖ్యం. అందువల్ల సాత్విక ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసం ఉండే వారు సీజనల్ పండ్లు, పాలు, పెరుగు వంటివి తీసుకోవచ్చు. ఉపవాసం లేని వారు పెసరపప్పు కూరగాయల చారు, సాదా అన్నం, రొట్టెలు వంటి తేలికపాటి భోజనం చేయవచ్చు. అయితే, ఈ రోజున ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం మరియు మద్యపానానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి.