Hanumantha Vahana Seva: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం నిర్వహించిన హనుమంత వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను అలరించారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, కేరళ, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 25 కళాబృందాల్లోని 516 మంది కళాకారులు పాల్గొన్నారు.

వివిధ రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలు, జానపద కళారూపాలు, గాన, వాద్య ప్రదర్శనలు మాడ వీధుల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను నింపాయి. కళాకారుల ప్రదర్శనలను భక్తులు ఆసక్తిగా తిలకించారు.

నాలుగు కళాబృందాలకు ఈవో సన్మానం

హనుమంత వాహనసేవలో అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చిన నాలుగు కళాబృందాలను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర సన్మానించారు.

1. రామభక్త హనుమంత – కర్ణాటక: తారికెరెకు చెందిన దీప్తి హత్వార్ ఆధ్వర్యంలోని డీఎస్‌పీ కళాబృందం 28 మంది కళాకారులతో ప్రదర్శించిన ‘రామభక్త హనుమంత’ విశేషంగా ఆకట్టుకుంది.

2. భరతనాట్యం – తిరుపతి: జె. హరిప్రసాద్ ఆధ్వర్యంలోని ఎస్‌వీఎంసీడీ కళాబృందం 21 మంది కళాకారులతో ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది.

3. మరుణి నృత్యం – సిక్కిం: గ్యాంగ్‌టక్‌కు చెందిన జోయ్‌దేవ్ దేకా ఆధ్వర్యంలోని ఏఎన్‌పీ కళాబృందం 15 మంది కళాకారులతో ప్రదర్శించిన సంప్రదాయ మరుణి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

4. కొమ్ముకోయ – తెలంగాణ: చింతూరు గ్రామానికి చెందిన టి. ఏడుకొండలు ఆధ్వర్యంలోని హెచ్‌డీపీపీ కళాబృందం 20 మంది కళాకారులతో ప్రదర్శించిన కొమ్ముకోయ జానపద కళారూపం భక్తులను ఆకట్టుకుంది.

భారతీయ సంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూ, భక్తిభావాన్ని పెంపొందించేలా టీటీడీ నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతున్నాయి. వివిధ రాష్ట్రాల కళారూపాల సమ్మేళనంతో హనుమంత వాహనసేవ మరింత వైభవోపేతంగా సాగింది.

Tags: