Dharmaraju: కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన అనంతరం హస్తినాపురంలో ఒక ఊహించని సంచలన సంఘటన చోటుచేసుకుంది. పాండవ అగ్రజుడైన ధర్మరాజు, లోకంలోని స్త్రీ జాతి మొత్తానికి ఒక విచిత్రమైన శాపాన్ని ఇచ్చారు. ఇకపై ఏ మహిళ కూడా తన మనస్సులో ఎలాంటి రహస్యాన్ని దాచుకోలేదని, ఆ గుట్టు బయటపడిపోతుందని ఆయన శపించారు.

ఘటనకు అసలు కారణం – కర్ణుడి రహస్యం:

కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత మరణించిన యోధులందరికీ ఉత్తరక్రియలు (అంతిమ సంస్కారాలు) నిర్వహిస్తున్న సమయంలో ఈ నిజం వెలుగులోకి వచ్చింది. పాండవుల తల్లి కుంతీదేవి తీవ్ర దుఃఖంతో రోదిస్తూ, కర్ణుడు వేరెవరో కాదని, తన జ్యేష్ఠ పుత్రుడని (పాండవులకు అన్నయ్య అని) పాండవులకు వెల్లడించింది. సూర్యభగవానుడి ప్రసాదంగా పెళ్లికి ముందే జన్మించినందున, సమాజానికి భయపడి ఆ విషయాన్ని ఇన్నాళ్లూ రహస్యంగా ఉంచానని కన్నీటిపర్యంతమైంది.

తల్లిపై ధర్మరాజు తీవ్ర ఆగ్రహం:

తమకు సొంత అన్నయ్య అని తెలియకుండానే కౌరవుల పక్షాన ఉన్న కర్ణుడిని అత్యంత దారుణంగా చంపేశామని గ్రహించిన పాండవులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇన్నాళ్లూ తమతో పోరాడింది తమ సొంత అన్నయేనని తెలిసి ధర్మరాజు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

సొంత అన్నను చంపుకున్నామనే అపరాధభావంతో రగిలిపోయిన ధర్మరాజు, తన తల్లి కుంతీదేవిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "అమ్మా! ఈ రహస్యాన్ని నువ్వు ముందుగానే చెప్పి ఉంటే మహాభారత యుద్ధమే జరిగేది కాదు, కోట్ల మంది సైనికులు, మన అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయేవారు కారు. కర్ణుడినే రాజును చేసి మేమందరం ఆయన పాదసేవ చేసుకునేవాళ్లం" అని ఆవేదన చెందారు.

స్త్రీ జాతికి శాపనార్థం:

తల్లి చేసిన ఈ ఒక్క చిన్న రహస్యం వల్ల ఇంతటి మహావినాశనం జరిగిందని భావించిన ధర్మరాజు, తీవ్ర ఆవేశంలో స్త్రీలందరినీ ఉద్దేశించి శాపం ఇచ్చారు. "ఈ రోజు నుంచి ప్రపంచంలో ఏ స్త్రీ కూడా తన మనస్సులో ఎలాంటి రహస్యాన్ని దాచుకోలేదుగాక!" అని శపించారు. ధర్మరాజు ఇచ్చిన ఆ శాపం వల్లనే నేటికీ మహిళలు తమ మనసులో రహస్యాలను ఎక్కువ కాలం దాచిపెట్టుకోలేరని పురాణాలు చెబుతున్నాయి.

Tags: