Amarnath Pilgrims: అమర్‌నాథ్ యాత్రికులకు నిరాశ.. ప్రారంభమైన 5 రోజుల్లోనే పూర్తిగా కరిగిపోయిన మంచు లింగం..

మంచు లింగం..

Update: 2026-07-09 10:51 GMT

Amarnath Pilgrims: పవిత్ర అమర్‌నాథ్ యాత్రకు వెళ్తున్న భక్తులకు తొలి రోజుల్లోనే తీవ్ర నిరాశ ఎదురైంది. హిమాలయాల్లోని పవిత్ర గుహలో ప్రకృతిసిద్ధంగా ఏర్పడే బాబా బర్ఫానీ పూర్తిగా కరిగిపోయింది. జూలై 3వ తేదీన అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ వార్షిక యాత్ర.. కేవలం ఐదు రోజులు గడిచేసరికే మంచు శివలింగం అంతర్థానం కావడం గమనార్హం. ప్రస్తుతం పవిత్ర గుహలో కేవలం త్రిశూల వేదిక మాత్రమే కనిపిస్తోందని అధికారులు వెల్లడించారు.

కరిగిపోవడానికి ప్రధాన కారణాలు..

గ్లోబల్ వార్మింగ్ - వాతావరణ మార్పులు :

హిమగిరుల్లో గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వల్ల పర్వత ప్రాంతాల్లో వేడి పెరిగి మంచు వేగంగా కరిగిపోతోందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భక్తుల రద్దీ - శ్వాసక్రియ వేడి:

ఈ ఏడాది యాత్ర ప్రారంభమైన తొలి రోజు నుంచే భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరిగింది. మొదటి 4 రోజుల్లోనే దాదాపు 86 వేల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకోగా, ఐదో రోజు నాటికి ఆ సంఖ్య లక్ష దాటింది. గుహలోకి ఒకేసారి వేలాది మంది ప్రవేశించడం, వారి శ్వాసక్రియ ద్వారా వెలువడే వేడి కారణంగా కూడా గుహ లోపల ఉష్ణోగ్రతలు పెరిగి మంచులింగం త్వరగా కరిగిపోయి ఉంటుందని భావిస్తున్నారు.

కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్ర..

మంచు శివలింగం పూర్తిగా కరిగిపోయినప్పటికీ, అమర్‌నాథ్ యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతుందని జమ్మూ కాశ్మీర్ యంత్రాంగం, శ్రైన్ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. పవిత్ర గుహను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తులు ఇంకా తరలివస్తూనే ఉన్నారు. సుమారు 57 రోజుల పాటు సాగనున్న ఈ వార్షిక యాత్రకు సంబంధించి బాలతాల్, పహల్గామ్ రెండు మార్గాల్లోనూ కట్టుదిట్టమైన భద్రత, వైద్య సదుపాయాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

Tags:    

Similar News