Divine Procession of Gokulananda: గరుడవాహనంపై గోకులానందుని దివ్య విహారం

దివ్య విహారం

Update: 2026-06-11 04:28 GMT

Divine Procession of Gokulananda: కార్వేటినగరం శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి నిర్వహించిన గరుడవాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడై గరుడునిపై అధిరోహించిన శ్రీ వేణుగోపాలస్వామివారు గ్రామ వీధుల్లో దివ్య విహారం చేస్తూ భక్తులకు మంగళకర దర్శనమిచ్చారు. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని తిలకించిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.

వైష్ణవ సంప్రదాయంలో గరుడసేవకు విశిష్ట స్థానం పౌరాణిక, ఆధ్యాత్మిక సంప్రదాయాలలో గరుడవాహన సేవకు అత్యున్నత ప్రాధాన్యం ఉంది. 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవను మహోత్కృష్టమైన ఉత్సవంగా నిర్వహిస్తారు. భగవంతునికి పరమభక్తుడైన గరుడునిపై విహరించడం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తి మహిమను లోకానికి చాటిచెబుతారు.

జ్ఞాన–వైరాగ్యాలకు ప్రతీక గరుడ దర్శనం

జ్ఞానవైరాగ్య స్వరూపమైన రెక్కలతో విహరించే గరుడుని దర్శించిన వారికి పాప విమోచనం కలిగి, ఆధ్యాత్మిక పురోగతి సిద్ధిస్తుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ గరుడవాహన సేవ ద్వారా స్వామివారు భక్తకోటికి జ్ఞాన, భక్తి, వైరాగ్య మార్గాలను బోధిస్తున్నారని పండితులు వివరిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ చెగల్రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News