Ashtadasha Shakti Peetham - Kanchi Kamakshi Temple: అష్టాదశ శక్తి పీఠం.. కంచి కామాక్షి అమ్మవారి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా?
అమ్మవారి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా?;
Ashtadasha Shakti Peetham - Kanchi Kamakshi Temple: సాధారణంగా, భారతదేశంలోని పుణ్యక్షేత్రాలలో అమ్మవారికి అనేక ఆలయాలు ఉంటాయి. కానీ, కంచిలో కామాక్షి అమ్మవారి ఆలయం మాత్రమే ఉంది. మిగిలిన దేవాలయాలన్నీ శివ, విష్ణు ఆలయాలు. కంచిలోని అన్ని దేవాలయాలకు కామాక్షి అమ్మవారే ప్రధాన శక్తి అని నమ్ముతారు. కామాక్షి అమ్మవారు ఇక్కడ పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తారు. సాధారణంగా చాలా దేవాలయాల్లో అమ్మవారి విగ్రహాలు నిలబడి ఉంటాయి. కామాక్షి అమ్మవారి ఈ శాంతమైన భంగిమ ఒక ప్రత్యేకత. ఆమె ఒక చేతిలో చెరుకు గడ, మరొక చేతిలో చిలుకను ధరించి ఉంటుంది. కంచి కామాక్షి ఆలయం అష్టాదశ (18) శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సతీదేవి శరీర భాగాలలో నాభి ఇక్కడ పడిందని నమ్ముతారు. అందుకే ఈ ప్రాంతాన్ని "నభిస్థాన ఒట్టియాన పీఠం" అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించి, అమ్మవారి ఉగ్ర రూపాన్ని శాంతపరచడానికి ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రాన్ని ప్రతిష్ఠించారని ప్రతీతి. ఈ శ్రీ చక్రం ఇప్పటికీ ఆలయంలో దర్శనమిస్తుంది. అందుకే ఈ ఆలయానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. కామాక్షి' అనే పదానికి "లక్ష్మి, సరస్వతిని కన్నులుగా కలది" అని అర్థం. అమ్మవారిని దర్శించుకునే ముందు ఇక్కడ గోపూజ చేస్తారు. గోవు వెనుక భాగాన్ని అమ్మవారి వైపు ఉంచి ఈ పూజ చేయడం ఇక్కడి ప్రత్యేక సంప్రదాయం. ప్రతి సంవత్సరం మాసి (ఫిబ్రవరి-మార్చి) నెలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వీటితో పాటు నవరాత్రులు, శంకర జయంతి వంటి పండుగలు కూడా ఘనంగా జరుపుతారు.