Tripura Sundari Temple: 524 ఏళ్ల నాటి త్రిపుర సుందరి ఆలయం.. ఎక్కడుందో తెలుసా..?

ఎక్కడుందో తెలుసా..?

Update: 2025-09-23 13:07 GMT

Tripura Sundari Temple: త్రిపురలోని గోమతి జిల్లా ఉదయపూర్ పట్టణంలో ఉన్న పురాతన మాతా త్రిపుర సుందరి ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు.. 51 శక్తి పీఠాలలో ఒకటిగా గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పురాణాల ప్రకా.. శివుని తాండవం సమయంలో సతీదేవి కుడి పాదం ఇక్కడ పడిందని నమ్ముతారు. మాతాబరి లేదా త్రిపురేశ్వరి ఆలయం అని కూడా పిలువబడే ఈ దేవాలయాన్ని ఇప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు.

ఆలయ చరిత్ర మరియు ప్రాముఖ్యత

ఈ ఆలయాన్ని 1501లో మహారాజా ధన్య మాణిక్య బహదూర్ నిర్మించారు. అగర్తలా నుండి 60 కిలోమీటర్ల దూరంలో తాబేలు వీపు ఆకారంలో ఉన్న కొండపై ఈ ఆలయం నిర్మించబడింది. శ్రీ విద్యా ధర్మంలో మాతా త్రిపుర సుందరిని మూడు లోకాలలో అత్యంత అందమైన దేవతగా పూజిస్తారు. ప్రతి సంవత్సరం దీపావళికి రెండు లక్షల మందికి పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.

ఈ ఆలయం ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంది. ఇక్కడ వైష్ణవ, శాక్త సంప్రదాయాలు ఏకమవుతాయి. శక్తి దేవతతో పాటు, విష్ణువును కూడా షాల్గ్రామ్ శిల రూపంలో పూజిస్తారు. శివుడు, శక్తి ఐక్యతకు ఇది ఒక అరుదైన, దైవిక ప్రదేశం.

పురాణాల ప్రకారం.. మహారాజు ఒక కలలో ఆదిశక్తి ఆదేశం మేరకు చిట్టగాంగ్ నుండి త్రిపుర సుందరి దేవత విగ్రహాన్ని తీసుకువచ్చాడు. ఆ తర్వాత ఆలయం సమీపంలో ఒక చెరువు తవ్వేటప్పుడు చోటి మా అని పిలువబడే మరో విగ్రహం దొరికింది. నేటికీ ఈ రెండు విగ్రహాలను పూజారులు సంరక్షిస్తున్నారు.

పునరాభివృద్ధి ప్రాజెక్టు

మాజీ ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ దేబ్ 2018లో ఆలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పునరాభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా ఈ ఏడాది జూలైలో శక్తి పీఠ్ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ పునరాభివృద్ధిలో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న స్థలంలో మొత్తం 51 హిందూ శక్తి పీఠ దేవాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు.

ఈ కొత్త నిర్మాణంలో మూడు అంతస్తులు ఉన్నాయి. ఇందులో లాబీలు, 86 దుకాణాలు, బహుళార్ధసాధక మందిరాలు, ప్రసాద్ గృహం, సన్యాసులు, వాలంటీర్లకు వసతి గృహాలు ఉన్నాయి. శక్తి పీఠ్ పార్కులో ఫుడ్ కోర్టులు, పార్కింగ్ స్థలాలు, సావనీర్ దుకాణాలు, అతిథుల వసతి, త్రిపుర చరిత్రను తెలిపే మ్యూజియం వంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టు ఆలయాన్ని భక్తులకు మరింత సౌకర్యవంతమైన, ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మార్చనుంది.

Tags:    

Similar News