Kapila Theertham: కపిలతీర్థంలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు
మెరుగైన సౌకర్యాలు
Kapila Theertham: కపిలతీర్థంలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ గురువారం సాయంత్రం ఆలయాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లను మరింత పటిష్టంగా తీర్చిదిద్దడం, డ్రైనేజీ వ్యవస్థ మరమ్మతులు చేపట్టడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి అంశాలపై సమగ్ర నివేదిక తయారు చేసి త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి శ్రీ గిరిధర్, డీఈలు శ్రీ రవిశంకర్ రెడ్డి, శ్రీమతి సరస్వతి, ఈఈలు శ్రీ మల్లికార్జున ప్రసాద్, శ్రీమతి సుమతి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డా. సునీల్ ప్రసాద్, సూపరింటెండెంట్ శ్రీ కె.పి. చంద్రశేఖర్ తదితర అధికారులు పాల్గొన్నారు.