KuntiDevi: కష్టాలు వచ్చినా దేవుడిని మరవొద్దు.. కుంతీదేవి కోరిక వెనుక ఆంతర్యమిదే
ఆంతర్యమిదే
KuntiDevi: కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. శ్రీకృష్ణుడు పాండవులకు అండగా నిలిచి, ధర్మాన్ని గెలిపించాడు. వారు విజయాన్ని సాధించారు. అనేక అవమానాలు, ఆప్తుల మరణాలను చూసిన కుంతీదేవికి.. ఇప్పుడు కష్టాల నుంచి విముక్తి లభించింది. ద్వారకకు వెళ్లేందుకు సిద్ధమైన కృష్ణుడ్ని- ఒక వరం ఇవ్వమని అడిగింది కుంతీదేవి. ‘ఏ వరం కావాలో కోరుకో అత్తా! తప్పకుండా తీరుస్తాను’ అన్నాడు కృష్ణుడు. ‘నేను సదా కష్టాలలో ఉండేలా వరమివ్వు కృష్ణా!’ అందామె.
అందరూ కష్టాల నుంచి బయటపడాలి, సుఖసంతోషాలతో జీవించాలని వరాలు కోరుకుంటారు. కానీ ఆమె కష్టమే కావాలనడంతో.. ‘అత్తా! జీవితమంతా ఎన్నో కష్టాలు అనుభవించావు. భర్తను కోల్పోయావు. పాండవులు చిన్నవయసులోనే ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నారు. అడవుల్లో అష్టకష్టాలు అనుభవించారు. నిండు సభలో ద్రౌపదికి జరిగిన అవమానాన్ని చూశావు. చివరికి కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో ఆత్మీయులను కోల్పోయావు. ఇప్పుడిప్పుడే ప్రశాంతమైన జీవితం ప్రారంభం కానుంది. మళ్లీ కష్టాలను ఎందుకు కోరుకుంటున్నావు?’ అనడిగాడు శ్రీకృష్ణుడు.
బదులుగా కుంతీదేవి చిరునవ్వు నవ్వి ‘కృష్ణా! నువ్వు చెప్పినదంతా నిజమే. కానీ, ఆ కష్టాలన్నింటిలోనూ నువ్వు మాకు అండగా నిలిచావు. ఆపద వచ్చిన ప్రతిసారీ నిన్నే తలచుకున్నాను. నువ్వు కాపాడతావనే నమ్మకంతో ధైర్యంగా ఉండగలిగాను. కష్టాలు ఎదురైన ప్రతిసారీ నీ సాన్నిధ్యాన్ని అనుభవించాను. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవనే నమ్మకం కొండంత బలాన్నిచ్చింది. సుఖసంతోషాల్లో మునిగినప్పుడు భగవంతుడ్ని మర్చిపోయే అవకాశముంది. సంపద, అధికారం, పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పుడు.. అదంతా తన ప్రతిభే అనుకోవడం పరిపాటి. కానీ, కష్టం ఎదురైనప్పుడు తన పరిమితులు తెలుస్తాయి. అప్పుడు భగవంతుడి సాయం కోసం తపిస్తాం. అందుకే కృష్ణా! నిన్ను మర్చిపోయే సుఖాల కంటే, నువ్వు స్మరణకు వచ్చే కష్టమే మేలనిపిస్తోంది. కష్టాలు కలిగినా ఫర్వాలేదు. కానీ నా మనసులో నీ స్మరణ ఎన్నడూ తొలగిపోకూడదు’ అంది. కుంతీదేవి భక్తికి కృష్ణుడు ముగ్ధుడయ్యాడు.
ఈ ఉదంతం గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని అందిస్తుంది. ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా.. భగవంతుడ్ని స్మరిస్తే.. ఆ కష్టం ఇట్టే సమసిపోతుందని తెలియజేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడ్ని ప్రార్థించి, సమస్యలు తొలగిపోగానే ఆయనను విస్మరించడం నిజమైన భక్తి అనిపించుకోదు. ఆనందంగా ఉన్నప్పుడు కృతజ్ఞతాభావంతోనూ, కష్టసమయంలో విశ్వాసంతోనూ దైవాన్ని స్మరించగలగాలి. జీవితంలో సుఖదుఃఖాలు ఎండా వానల్లా మారుతుంటాయి. అవి మన చేతుల్లో ఉండకపోవచ్చు. కానీ, భగవంతుడ్ని తలచుకుని.. నమ్మకంతో నిబ్బరంగా ఉండటం మన చేతుల్లోనే ఉంది. కష్టాలు లేకపోవడం వరం కాదు. క్లిష్ట పరిస్థితిలోనూ భగవంతుడ్ని మర్చిపోని మనసు ఉండటమే నిజమైన వరం.