Kari Ishti Yagam: సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుమలలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న కారీరిష్టి యాగం రేపు పూర్ణాహుతితో ముగియనుంది.

కరీరిష్టి యాగ విశేషాంశాలు :

కృష్ణ వర్ణ పదార్థాల వినియోగ ప్రాధాన్యం:

వైదిక సంప్రదాయంలో వర్షసమృద్ధి కోసం రుత్వికులు నల్లని వస్త్రాలను ధరించి నిర్వహించే ఈ ఇష్టి యాగంలో నల్లని గుర్రం, నల్లని గొర్రె, నల్లని తేనె, నల్లని బియ్యం, నల్లని ఖర్జూరం వంటి శ్రేష్ఠమైన ద్రవ్యాలను శాస్త్రోక్తంగా ఉపయోగిస్తారు. తద్వారా మేఘాలు దట్టంగా కమ్మి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని విశ్వాసం.

వరుణ దేవత ఆవాహనకు విశిష్ట ప్రాధాన్యత:

కృష్ణ యజుర్వేదానికి సంబంధించిన ”మారుతమసి” మంత్రాలను జపిస్తూ ఇష్టి యాగాన్ని నిర్వహిస్తారు. యాగంలో ”గలిజేరు” ఆకుల (పునర్నవ)ను హోమ ద్రవ్యంగా సమర్పిస్తారు.

అలాగే ”వేపశశాక” (ప్రబ్భల)తో తయారు చేసిన సమిధలను హోమగుండం చుట్టూ వెలిగించి వైదిక విధానంలో యాగక్రతువును రుత్వికులు నిర్వహిస్తారు.

అదేవిధంగా, గలిజేరు ఆకులను హోమంలో సమర్పించే సమయంలో వచ్చే నల్లని పొగకు కూడా వైదిక ప్రక్రియ లో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఇది సమృద్ధికరమైన వర్షాలకు సంకేతం.

వరుణ జప మంత్రాలు :

కారీరిష్టి యాగంతో పాటు ”వరుణానువాకా”లను జపిస్తూ వరుణ జపాన్ని వైదికులు నిర్వహిస్తారు.

లోకక్షేమం కోసం వైదిక క్రతువు:

సకాలంలో వర్షాలు కురిసి భూమి సస్యశ్యామలంగా మారాలని, పంటలు సమృద్ధిగా పండాలని, జల వనరులు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని సంకల్పిస్తూ ఈ యాగాన్ని టీటీడీ 1994వ సంవత్సరం నుండి నిర్వహిస్తోంది.

కాగా ఐదు రోజుల పాటు కొనసాగుతున్న ఈ వైదిక క్రతువు సెప్టెంబర్ 03న ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల నడుమ పూర్ణాహుతితో ఘనంగా ముగియనుంది.

Tags: