Tirumala Tirupati : టీటీడీలో నలుగురు హిందూయేతర ఉద్యోగుల సస్పెన్షన్
టీటీడీ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ;
తిరుమల తిరుపతి దేవస్ధానంలో పని చేస్తున్న నలుగురు హిందూయేతర ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ సీపీఆర్‌ఓ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇతర మత విశ్వాసాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలపై నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు సీపీఆర్‌ఓ పేర్కొన్నారు. సస్పెన్షన్ కు గురైన ఉద్యోగుల్లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బి.ఎలిజర్, బీఐఆర్‌ఆర్‌డీ హాస్పిటల్ లో స్టాఫ్ నర్సుగా విధులు నిర్వహిస్తున్న ఎస్.రోజి, ఆదే హాస్పిటల్ లో గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్న ప్రమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీల పనిచేస్తున్న జి.అసుంత ఉన్నారు. టీటీడీ ప్రవర్తనా నియమావళిని పాటించకపోవడంతో పాటు హిందూ మత సంస్ధల ప్రాయోజిత సంస్ధల్లో పని చేస్తున్న ఉద్యోగులుగా తమ విధుల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరింస్తున్నారని ఈ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు సీపీఆర్‌ఓ ప్రకటనలో తెలియజేశారు. టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికతో పాటు ఇతర ఆధారాలను పరిశీలించిన తరువాత ఆ నలుగురిపై టీటీడీ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు టీటీడీ సీపీఆర్‌ఓ తెలియజేశారు.