Friday Blessings of Goddess Lakshmi: శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం: సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఆ 5 శుభ వస్తువులు ఇవే..
సంపద, ఐశ్వర్యాన్ని ఆకర్షించే ఆ 5 శుభ వస్తువులు ఇవే..
Friday Blessings of Goddess Lakshmi: సనాతన ధర్మంలో వారాల అన్నింటిలోకి శుక్రవారానికి ఒక ప్రత్యేకమైన, దైవిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజును సంపద, అదృష్టం, శ్రేయస్సుకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాల ప్రకారం.. శుక్రవారం నాడు కొన్ని పవిత్రమైన వస్తువులను ఇళ్లకు తీసుకురావడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.
మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, అపారమైన సంపద, మనశ్శాంతి కలగాలంటే శుక్రవారం నాడు ఈ క్రింది 5 శుభ వస్తువులను మీ ఇంటికి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.
తామర పువ్వు లేదా సుగంధ ద్రవ్యాలు
తామర పువ్వు స్వచ్ఛతకు ప్రతీక మరియు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైనది. శుక్రవారం నాడు తాజా తామర పువ్వులను తెచ్చి అమ్మవారి పాదాల చెంత ఉంచడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. ఒకవేళ తామర పువ్వులు దొరకకపోతే, మల్లెలు వంటి సువాసనగల పూలను తీసుకురావచ్చు. వీటితో పాటు మంచి నాణ్యత గల అగరబత్తులు, సుగంధ తైలాలను కొనుగోలు చేయవచ్చు. ఈ దివ్యమైన సువాసనలు ఇంట్లోని నిస్తేజతను, మానసిక ఒత్తిడిని తొలగించి పాజిటివ్ వైబ్స్‌ను పెంచుతాయి.
వెండి వస్తువులు
వాస్తు శాస్త్రం ప్రకారం, వెండి లోహానికి చంద్రునితో సంబంధం ఉంటుంది. ఇది మనశ్శాంతిని, స్థిరమైన సంపదను సూచిస్తుంది. శుక్రవారం నాడు ఒక చిన్న వెండి నాణెం, వెండి పాత్ర లేదా ఉంగరాన్ని కొని ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవిని శాశ్వతంగా ఆహ్వానించినట్లవుతుందని నమ్ముతారు. పూజ గదిలో ఈ వెండి నాణేనికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మీ బీరువా లేదా నగదు పెట్టెలో.ఉంచుకోవడం వల్ల ఆదాయం వృద్ధి చెందుతుంది.
తెల్లని వస్త్రాలు లేదా పాలతో చేసిన మిఠాయిలు
ఆధ్యాత్మిక నిపుణుల ప్రకారం.. శుక్రవారానికి అధిపతి శుక్ర గ్రహం. ఈ శుక్రుడు విలాసానికి, అందానికి, తెలుపు రంగుకు ప్రతీక. అందుకే శుక్రవారం నాడు కొత్త తెల్లని బట్టలు కొనడం లేదా పాలతో చేసిన తెల్లని మిఠాయిలను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం సాయంత్రం ఈ మిఠాయిలను కుటుంబ సభ్యులందరికీ పంచడం వల్ల ఇళ్లలో అన్యోన్యత, ప్రేమ పెరుగుతాయి.
పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత
దుమ్ము, ధూళి, గందరగోళం ఉన్నచోట అలక్ష్మి నివాసముంటుందని, లక్ష్మీదేవి అక్కడ అస్సలు కొలువై ఉండదని వాస్తు శాస్త్రం చెబుతోంది. కాబట్టి శుక్రవారం నాడు ఇళ్లను, ముఖ్యంగా సింహద్వారం, పూజ గదిని అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముఖద్వారం వద్ద ముగ్గులు వేసి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. సాయంత్రం వేళ ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే.. ఇంట్లోకి శుభ తరంగాలు ప్రవేశిస్తాయి.
దానధర్మాలు
"ఉన్నదానిని పంచుకుంటేనే సంపద పెరుగుతుంది" అనేది పెద్దల మాట. మీ జాతకంలో శుక్రుడిని బలపరచడానికి, లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి శుక్రవారం నాడు దానాలు చేయడం చాలా శక్తివంతమైన పరిహారంగా పనిచేస్తుంది. ఈ రోజున బియ్యం, పప్పులు వంటి ఆహార ధాన్యాలను లేదా బట్టలను కొనుగోలు చేసి, వాటిని నిరుపేదలకు, అవసరమైన వారికి దానం చేయడం వల్ల ఇంట్లోని కష్టాలన్నీ తొలగిపోయి పుణ్యఫలం దక్కుతుంది.
ఆర్థిక అడ్డంకులను అధిగమించి, సుఖసంతోషాలతో ఇల్లు వర్ధిల్లాలంటే ఈ చిన్నపాటి వాస్తు నియమాలను, పరిహారాలను ప్రతీ శుక్రవారం పాటించడం ఎంతో మంచిది.