Friday Mahalakshmi Puja: శుక్రవారం మహాలక్ష్మీ పూజ.. ఆర్థిక కష్టాలు తీరి, అష్టైశ్వర్యాలు కలగాలంటే ఇలా చేయండి..
ఇలా చేయండి..
Friday Mahalakshmi Puja: హిందూ సంప్రదాయంలో శుక్రవారానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజును సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యాలకు అధిదేవత అయిన మహాలక్ష్వీ దేవి ఆరాధనకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. శుక్రవారం నాడు ఎవరైతే భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారో, వారి ఇంట్లో దారిద్ర్యం తొలగిపోయి ఆర్థిక స్థిరత్వం, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని కోట్లాది మంది భక్తుల నమ్మకం. అసలు శుక్రవారం పూజ ఎందుకు ప్రత్యేకమైనది? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి పూజా విధానాన్ని పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
శుక్రవారం లక్ష్మీ పూజ ఎందుకు విశేషం?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించిన రోజు. జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే భౌతిక సుఖాలు, విలాసవంతమైన జీవితం, వ్యాపారంలో పురోభివృద్ధి లభిస్తాయి. శుక్రవారం నాడు మహాలక్ష్వీ దేవిని పూజించడం వల్ల జాతకంలో శుక్రుని స్థానం బలపడి, కుటుంబంలో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.
పూజకు ముందు చేయాల్సిన సదాచారాలు..
లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పరిశుభ్రత, సకారాత్మక శక్తి ఉన్న చోటనే నివసిస్తుంది.
ఉదయమే లేచి ఇల్లు, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి.
ఇంటి ప్రధాన ద్వారం (సింహద్వారం) వద్ద కలశంలో నీటిని ఉంచి, ఒక మంగళకరమైన దీపాన్ని వెలిగించాలి.
అనంతరం అమ్మవారి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని తాజా పూలతో అలంకరించుకోవాలి.
అమ్మవారికి ప్రీతికరమైన పూజా విధానం..
దీపారాధన:
పూజ గదిలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను ఉపయోగించి దీపాలను వెలిగించాలి
.
పుష్పార్చన:
మహాలక్ష్వీ దేవికి అత్యంత ఇష్టమైన తామర పువ్వులు లేదా ఎరుపు రంగు పూలతో అర్చన చేయాలి.
నామావళి పఠనం:
అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పిస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రం పఠించాలి.
విశేష నైవేద్యం:
ప్రసాదం కోసం పాలు, పాయసం లేదా చక్కెర పొంగలి వంటి సాత్విక తీపి పదార్థాలను సమర్పించాలి. పూజ ముగిసిన తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి హారతి తీసుకుని ప్రసాదాన్ని స్వీకరించాలి.
ఆర్థికాభివృద్ధికి చిన్న చిట్కా:
ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి ఈశాన్య మూలలో రెండు దీపాలను వెలిగించాలి. ఆ దీపాల ముందు కూర్చుని “ఓం శ్రీ మహాలక్ష్యై నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి, ఆర్థిక పురోగతి వేగంగా జరుగుతుంది.
శుక్రవారం రోజున ఇవి అస్సలు చేయకండి..
శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం సదా మనపై ఉండాలంటే శుక్రవారం నాడు కొన్ని పొరపాట్లకు దూరంగా ఉండాలి..
ఇనుప వస్తువులు:
శుక్రవారం నాడు వంటగదికి ఉపయోగించే ఇనుప పాత్రలు లేదా ఇతర ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు.
ఆస్తి లావాదేవీలు:
ముఖ్యమైన ఆస్తుల కొనుగోలు లేదా అమ్మకాలకు సంబంధించిన ఒప్పందాలను ఈ రోజు వాయిదా వేసుకోవడం మంచిది.
అప్పులు ఇవ్వడం, తీసుకోవడం:
ఈ రోజు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గరి నుండి అప్పు తీసుకోకూడదు. దీనివల్ల ధన నష్టం జరుగుతుంది.
పరిశుభ్రత:
ఇల్లు అపరిశుభ్రంగా ఉంచకూడదు. ముఖ్యంగా సాయంత్రం దీపం పెట్టిన తర్వాత ఇంట్లోని చెత్తను లేదా కసువును బయట పారేయకూడదు.