SRIVANI TICKETS : ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజుకారోజు శ్రీవాణి ద‌ర్శ‌నమ్

నూతన విధానాన్ని ఆగస్టు 1 నుంచి 15 వరకు ప్రయోగత్మకంగా అమలు చేయనున్న టీటీడీ;

Update: 2025-07-31 04:13 GMT

శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్లు ఆఫ్ లైన్లో పొంది శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం విచ్చేసే భ‌క్తుల సౌక‌ర్యార్థం వారి ద‌ర్శ‌న స‌మ‌యాల్లో మార్పులు చేస్తున్న‌ట్లు టీటీడీ అద‌నపు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి తెలియ‌జేశారు. తిరుమ‌ల‌లోని గోకులం స‌మావేశ మందిరంలో ఆయ‌న శ్రీ‌వాణి దర్శ‌నాల‌పై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తారీఖు వరకు ఈ నూతన విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత విధానం వలన సదరు శ్రీవాణి టికెట్ దర్శనం కోసం భక్తులకు సుమారుగా మూడు రోజుల సమయం పట్టేది. భక్తులు సౌకర్యార్థమై ఏ రోజు కా రోజు టికెట్ జారీ మరియు దర్శనం కల్పించడం గురించి ప్రయోగాత్మకంగా ఆగస్టు 01 తారీఖు నుండి 15వ తారీఖు వరకు టీటీడీ అమలు చేయనుంది. తిరుమ‌ల‌లో ఉద‌యం 10 గంట‌ల నుంచి మొద‌ట‌ వ‌చ్చిన వారికి మొద‌టి ప్రాతిప‌దిక‌న టికెట్ల‌ జారీ చేస్తారు. టికెట్లను పొందిన శ్రీవాణి భక్తులకు తిరుమ‌ల‌లోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వ‌ద్ద అదే రోజు సాయంత్రం 4.30 గంట‌ల‌కు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది. రేణిగుంట విమానాశ్ర‌యంలో ఉద‌యం 7 గంట‌ల నుంచి ద‌ర్శ‌న టికెట్లు కోటా ఉన్నంతవరకు జారీ చేస్తారు. వీటితో పాటు య‌థావిధిగా తిరుమ‌ల‌లో ఆఫ్ లైన్ ద్వారా 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్ర‌యంలో 200 టికెట్లు టీటీడీ జారీ చేయనుంది. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆక్టోబ‌ర్ 31వ తేది వ‌ర‌కు ఆన్ లైన్‌లో శ్రీ‌వాణి టికెట్లను పొందిన భ‌క్తుల‌కు య‌థావిధిగా ఉద‌యం 10 గంట‌ల‌కే ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. న‌వంబ‌ర్ 1వ తేది నుంచి శ్రీ‌వాణి టికెట్ల‌ను ఆఫ్ లైన్ మ‌రియు ఆన్ లైన్ టికెట్లు పొందిన భక్తులు సాయంత్రం 4:30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లవచ్చు. భ‌క్తులు ముందుగా కౌంట‌ర్ల వ‌ద్ద‌కు చేరుకుని తాము ఇబ్బంది ప‌డ‌కుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవాణి టికెట్ జారీ చేయు ప్రదేశం వద్దకు చేరుకోవాలని అదనపు ఈఓ విజ్ఞప్తి చేశారు. ఈ నూతన విధానం తో భక్తులు వచ్చిన రోజునే దర్శనం చేసుకునే వెసులుబాటు దొరుకుతుందని ఏఈఓ వెంకయ్య చౌదరి తెలిపారు. ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డిప్యూటీ ఈవోలు లోక‌నాథం, వెంకటయ్య, ట్రాన్స్ పోర్ట్ మరియు ఐటీ జీఎం శేషారెడ్డి, వీజీవోలు రామ్ కుమార్‌, సురేంద్ర‌, ఐటి డిప్యూటీ జిఎం వెంకటేశ్వర్లు నాయుడు తదితరలు పాల్గొన్నారు.

Tags:    

Similar News