Garuda Purana: హిందూ సాంప్రదాయంలో అత్యంత కీలకమైన, రహస్యమైన గ్రంథాలలో 'గరుడ పురాణం' ఒకటి. మనిషి జీవితం, మరణం, మనం చేసే కర్మలు.. వాటి వల్ల వచ్చే ఫలితాల గురించి భగవాన్ విష్ణువు ఇందులో చాలా వివరంగా చెప్పారు. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి ఆత్మకు ప్రశాంతత చేకూరడానికి ఇంట్లో గరుడ పురాణాన్ని పఠిస్తారు. కానీ, కేవలం మరణించినప్పుడే కాదు.. బతికున్నప్పుడు కూడా ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ దీనిని వినాలి. గరుడ పురాణం ప్రకారం.. మనిషి బతికున్నప్పుడు చేసే కొన్ని తప్పులు లేదా పాపాల వల్ల మరణానంతరం మోక్షం లభించదు సరికదా, నేరుగా నరకానికి వెళ్లి ఘోరమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. మరి యమధర్మరాజు ఆగ్రహానికి గురిచేసే ఆ ఏడు ఘోరమైన తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గురువులను, తల్లిదండ్రులను అవమానించడం:

సృష్టిలో దైవంతో సమానమైన తల్లిదండ్రులను, జీవితానికి మార్గం చూపే గురువులను ఎవరైతే దూషిస్తారో, అవమానిస్తారో.. వారికి నరకంలో తీవ్రమైన శిక్షలు తప్పవని గరుడ పురాణం చెబుతోంది.

2. నమ్మకద్రోహం , అబద్ధాలు ఆడటం:

తమను నమ్మిన వారిని మోసం చేయడం, నిరుపేదల సొమ్మును అపహరించడం, కోర్టుల్లో లేదా నిజ జీవితంలో అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం మహాపాపంగా పరిగణించబడుతుంది.

3. అన్నాన్ని, నీటిని వృథా చేయడం:

ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకపోగా.. చేతిలో ఉన్న ఆహారాన్ని, నీటిని నిర్లక్ష్యంగా పారేసేవారికి, ప్రకృతిని గౌరవించని వారికి మరణానంతరం నరకకూపంలో చోటు దక్కుతుంది.

4. స్త్రీలను గౌరవించకపోవడం:

మహిళలపై దౌర్జన్యం చేయడం, వారిని అవమానించడం లేదా పరస్త్రీలను వ్యామోహంతో చూడటం లాంటివి చేసేవారికి నరకంలో కఠినమైన యమయాతనలు ఉంటాయని విష్ణుమూర్తి స్వయంగా చెప్పారు.

5. జంతు హింస, ప్రాణకోటిని బాధించడం:

నోరు లేని జీవులను, పశుపక్ష్యాదులను స్వార్థం కోసం హింసించడం లేదా చంపడం ఘోరాతిఘోరమైన పాపం.

6. గర్వంతో ఇతరులను తక్కువ చేసి చూడటం:

ధనం, పదవి, అందం ఉన్నాయని అహంకారంతో పక్కవారిని కించపరిచేవారు, సమాజంలో బలహీనులను వేధించేవారు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవిస్తారు.

7. దైవ నింద, ధర్మ విరుద్ధమైన పనులు:

దేవుడిని, పురాణాలను కించపరచడం.. సమాజంలో అధర్మాన్ని ప్రోత్సహించడం వల్ల మనిషికి ఎప్పటికీ మోక్షం లభించదు.

Tags: