Goddess Lakshmi Is the Consort of Lord Vishnu: లక్ష్మీదేవి విష్ణుమూర్తి భార్య కదా.. మరి 'లక్ష్మి గణపతి' అని ఎందుకంటారు?

మరి 'లక్ష్మి గణపతి' అని ఎందుకంటారు?

Update: 2026-05-19 09:25 GMT

Goddess Lakshmi Is the Consort of Lord Vishnu: హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీమహావిష్ణువు. లక్ష్మీదేవి విష్ణుమూర్తి అర్ధాంగి అన్నది జగమెరిగిన సత్యం. మరి అలాంటప్పుడు పూజలు చేసేటప్పుడు, వ్యాపార సంస్థల పేర్లలో లేదా నోట్లపై 'లక్ష్మి గణపతి' అని ఎందుకు కలిపి పిలుస్తారు? వినాయకుడి పక్కన లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది? అనే అనుమానం చాలామందికి వచ్చే ఉంటుంది. దీని వెనుక పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథతో పాటు ఎంతో లోతైన ఆధ్యాత్మిక, ప్రాపంచిక అర్థం దాగి ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి లక్ష్మీదేవికి తన సంపద, వైభవం చూసుకుని కొంచెం అహంకారం పెరిగిందట. లోకంలో అందరూ తననే పూజిస్తారని, తన వల్లే అందరికీ సుఖాలు కలుగుతున్నాయని ఆమె భావించింది. లక్ష్మీదేవి మనసులోని ఈ గర్వాన్ని గమనించిన మహావిష్ణువు.. ఆమెకు ఒక నిజాన్ని గుర్తుచేయాలని అనుకున్నాడు.

విష్ణుమూర్తి నవ్వుతూ.. "లక్ష్మీ! ఒక స్త్రీ సంపదలు కలిగి ఉన్నప్పటికీ, ఆమె తల్లి కానంతవరకు ఆమె జీవితం సంపూర్ణమవ్వదు. నీకు సంతానం లేదు కాబట్టి నీవు ఇంకా తల్లి కాలేదు" అని అన్నాడు. ఆ మాటలకు లక్ష్మీదేవి ఎంతో బాధపడింది. వెంటనే తన బాధను చెప్పుకోవడానికి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళింది. పార్వతీదేవికి ఇద్దరు కొడుకులు (గణేశుడు, కుమారస్వామి) ఉన్నారు. లక్ష్మీదేవి బాధను చూసి చలించిపోయిన పార్వతీదేవి.. తన పెద్ద కుమారుడైన గణేషుడిని లక్ష్మీదేవికి దత్తపుత్రుడిగా ఇచ్చింది.

ఆ రోజు నుండి వినాయకుడు లక్ష్మీదేవికి కొడుకు వరుస అయ్యాడు. ఎంతో ఆనందించిన లక్ష్మీదేవి.. "ఇకపై ఎవరైతే నా దత్తపుత్రుడైన గణపతిని పూజించకుండా కేవలం నన్ను మాత్రమే పూజిస్తారో, వారికి నా అనుగ్రహం దక్కదు. నా అనుగ్రహం కావాలనుకునే వారు మొదట గణేషుడిని ఆరాధించాలి" అని వరం ఇచ్చింది. అందుకే లక్ష్మి, గణపతిలను తల్లి-కొడుకులుగా కలిపి పూజించే సంప్రదాయం మొదలైంది.

ఇక దీని వెనుక ఉన్న అసలైన ప్రాపంచిక అర్థాన్ని పరిశీలిస్తే.. లక్ష్మీదేవి అంటే 'సంపద లేదా ధనం'. వినాయకుడు అంటే 'బుద్ధి, జ్ఞానం మరియు విజ్ఞాన నిధి'.

కేవలం డబ్బు (లక్ష్మి) ఉండి, దానిని ఎలా వాడాలో తెలిసే బుద్ధి (గణపతి) లేకపోతే ఆ సంపద తప్పుడు మార్గంలో ఖర్చయిపోయి మనిషిని నాశనం చేస్తుంది. ధనంతో పాటు వివేకం కూడా ఉన్నప్పుడే ఆ సంపద సమాజానికి, మనకు ఉపయోగపడుతుంది. అందుకే "బుద్ధి లేని సంపద నిలవదు" అంటారు. సంపద శాశ్వతంగా మన ఇంట్లో నిలవాలన్నా, మనకు సద్బుద్ధి ఉండాలన్నా లక్ష్మి, గణపతి ఇద్దరి అనుగ్రహం ఒకేసారి కావాలి. అందుకే దీపావళి లాంటి పెద్ద పండుగలలో గానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు గానీ 'లక్ష్మి గణపతి' పూజలు చేస్తారు. లక్ష్మీదేవి ధనాన్ని ఇస్తే.. గణేశుడు ఆ ధనాన్ని కాపాడుకునే సద్బుద్ధిని ఇస్తాడు. ఇదీ లక్ష్మి గణపతి వెనుక ఉన్న అసలు రహస్యం!

Tags:    

Similar News