TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్: అక్టోబర్ నెల కోటా విడుదల తేదీలను ప్రకటించిన టీటీడీ!
టీటీడీ!
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ నెలకు సంబంధించిన వివిధ ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు మరియు వసతి గదుల కోటాను జూలై నెలలో టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ వివరాలను గమనించి, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించడం జరిగింది.
ముందుగా జూలై 18న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. ఈ సేవా టికెట్ల కోసం ఎలక్ట్రానిక్ డిప్ నమోదు ప్రక్రియ జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. డిప్ ద్వారా టికెట్లు పొందిన వారు 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
ఇక జూలై 21న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన స్లాట్ల కోటాను ఆన్‌లైన్‌లో ఉంచుతారు. జూలై 23వ తేదీన అంగ ప్రదక్షిణ టోకెన్లను ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను ఉదయం 11 గంటలకు, మరియు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
చివరగా జూలై 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలో గదుల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురానుంది. భక్తులు ఈ టికెట్ల కోసం https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని టీటీడీ స్పష్టం చేసింది.