Trending News

Devotional: గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు... చిన్నశేష వాహనంపై భక్తులకు అభయం

చిన్నశేష వాహనంపై భక్తులకు అభయం

Update: 2025-06-04 05:31 GMT

Devotional:తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన మంగళవారం స్వామివారు దేవేరులతో కలసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 గంటలకు వాహనసేవ వైభవంగా ప్రారంభమైంది.

నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి.

కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత ఉత్కృష్ఠమైనది. ఈ కుండలినీశక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది. భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీశక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్నశేష వాహనం.

చిన్నశేష వాహనం ”వాసుకి” గాను భావించవచ్చును. శ్రీవైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం – శేషవాహనం ఈ శేషశేషి భావాన్ని సూచిస్తున్నది. చిన్నశేష వాహనాన్ని సందర్శించిన భక్తులకు కుండలినీ యోగసిద్ధిఫలం లభిస్తుంది.

కాగా సాయంత్రం 5.30 – 06.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఊంజల్ సేవ జరగనుంది. రాత్రి 7.00 గంటల నుండి 9.00గంటల వరకు హంస వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవదనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. హంస వాహనంలోని పరమార్థం ఇదే. హంసలో పాలను, నీళ్లను వేరుచేసే సామర్థ్యం ఉంది. ‘సో హం’ భావం కలిగిన భక్తులలో అహంభావం తొలగించి ‘దాసోహం’ అనే భావం కలిగించడానికే పరమహంస రూపానికి ప్రతీక అయిన హంసవాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారు.

Tags:    

Similar News