Wearing Navaratna: హిందూ జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ దోషాల నివారణకు, అదృష్టం, శ్రేయస్సు కోసం రత్నధారణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జాతక చక్రంలోని బలహీన గ్రహాలను బలోపేతం చేయడానికి చాలామంది నవరత్నాలలో తమకు సూచించిన రత్నాన్ని ఉంగరం లేదా లాకెట్ రూపంలో ధరిస్తుంటారు. అయితే రత్నం ధరించిన వెంటనే ఫలితాలు కనిపించవని, ప్రతి రత్నానికి శరీరంతో, గ్రహ కిరణాలతో అనుసంధానం కావడానికి నిర్దిష్ట సమయం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. రత్నాలు ధరించిన తర్వాత వాటి ప్రభావం ప్రారంభం కావడానికి ఎంత సమయం పడుతుంది? రత్నధారణ సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏ రత్నం ప్రభావం ఎన్ని రోజులకు కనిపిస్తుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహానికి సంబంధించిన రత్నం తన శక్తిని ప్రసరించడానికి తీసుకునే కాలపరిమితి వేర్వేరుగా ఉంటుంది..

నీలం:

రత్నాలన్నింటిలో అత్యంత వేగంగా స్పందించేది నీలం. ఇది ధరించిన 24 గంటల నుంచి 3 రోజుల్లోనే తన సానుకూల లేదా ప్రతికూల ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. అందుకే దీనిని ధరించే ముందు పరీక్షించుకోవాలని సూచిస్తారు.

మాణిక్యం:

సూర్యుడి అనుగ్రహం కోసం ధరించే మాణిక్యం ప్రభావం సాధారణంగా 30 రోజుల నుంచి 45 రోజుల్లోపు క్రమంగా శరీరంలోకి, జీవితంలోకి ప్రభావం చూపుతుంది.

ముత్యం :

మనశ్శాంతి, మానసిక స్థిరత్వం కోసం ధరించే సహజ ముత్యం తన ప్రభావాన్ని 4 నుంచి 10 రోజుల్లోనే చూపించడం మొదలుపెడుతుంది.

పగడం :

ధైర్యం, రక్త సంబంధిత దోషాల నివారణ కోసం ధరించే పగడం ప్రభావం 21 నుంచి 30 రోజుల్లోపు స్పష్టంగా తెలుస్తుంది

పచ్చ :

జ్ఞానం, వ్యాపార వృద్ధి, వాక్చాతుర్యం కోసం ధరించే పచ్చ ధరించిన 15 నుంచి 25 రోజుల్లో సానుకూల మార్పులను అందిస్తుంది.

పుష్యరాగం :

జ్ఞానం, సంతానం, సంపదను ప్రసాదించే బృహస్పతి రత్నమైన పుష్యరాగం పూర్తి స్థాయిలో పనిచేయడానికి 15 నుంచి 30 రోజుల సమయం పడుతుంది.

వజ్రం :

విలాసవంతమైన జీవితం, కళారంగంలో రాణింపు కోసం ధరించే వజ్రం ప్రభావం 7 నుంచి 15 రోజుల్లో మొదలవుతుంది.

గోమేధికం :

ఈ ఛాయా గ్రహాల రత్నాలు సాధారణంగా 7 నుంచి 21 రోజుల్లో తమ ఫలితాలను బహిర్గతం చేస్తాయి.

రత్నాలు ధరించేటప్పుడు పాటించాల్సిన ముఖ్య నియమాలు

ప్రాణ ప్రతిష్ఠ - అభిషేకం: రత్నాన్ని ధరించే ముందు దాని సంబంధిత మంత్రాలతో శుద్ధి చేసి, సరైన నక్షత్రం, తిథి, హోర ఉన్న సమయంలో మాత్రమే ధరించాలి.

సరైన లోహం ఎంపిక: రత్నాన్ని బట్టి బంగారం, వెండి, రాగి లేదా పంచలోహాలలో పొదిగించాలి.

చర్మ స్పర్శ: ఉంగరంలోని రత్నం క్రింది భాగం శరీరం (చర్మం)ను తాకుతూ ఉండేలా అమర్చాలి. అప్పుడే గ్రహ కిరణాలు శరీరంలోకి ప్రసరిస్తాయి.

నిపుణుల సలహా తప్పనిసరి:

సొంత నిర్ణయాలతో లేదా కేవలం నచ్చిన రంగు అని రత్నాలను ధరించకూడదు. జన్మకుండలి ఆధారంగా అనుకూల గ్రహాల రత్నాలనే ఎంచుకోవాలి.

Tags: