Garuda Purana: పెళ్లి కాకుండానే మరణిస్తే.. వారికి శ్రాద్ధ కర్మలు ఎవరు చేయాలి..? గరుడ పురాణం ఏం చెబుతోంది?
గరుడ పురాణం ఏం చెబుతోంది?
Garuda Purana:హిందూ సంప్రదాయంలో జననం ఎంత ముఖ్యమో.. మరణానంతరం నిర్వహించే కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం. మరణించిన వ్యక్తి ఆత్మ శాంతించాలన్నా, పితృలోకాలకు చేరాలన్నా శ్రాద్ధం, తర్పణం వంటి విధులను శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా కుమారుడు తన తండ్రికి ఈ కర్మలు నిర్వహిస్తాడు. అయితే ఒక వ్యక్తి వివాహం చేసుకోకుండానే మరణిస్తే అతడికి ఆ కర్మలు చేసే హక్కు ఎవరికి ఉంటుందనే సందేహం చాలామందిలో ఉంటుంది. దీనిపై గరుడ పురాణం స్పష్టమైన వివరణ ఇచ్చింది.
ఎవరు అర్హులు? ప్రాధాన్యత క్రమం ఇదీ:
సాధారణంగా తండ్రికి కుమారుడు కర్మలు చేయడం ఆనవాయితీ. కానీ, కుమారుడు పెళ్లి కాకుండానే అకాల మరణం చెందితే, ఆ కొడుకు ఆత్మ శాంతి కోసం తండ్రి స్వయంగా శ్రాద్ధ కర్మలు చేయవచ్చు. తండ్రికి ఆ ప్రాథమిక అధికారం ఉందని శాస్త్రం చెబుతోంది. ఒకవేళ తండ్రి జీవించి లేకపోయినా లేదా అనారోగ్య కారణాల వల్ల చేయలేకపోయినా.. మరణించిన వ్యక్తి అన్నదమ్ములు ఈ విధులను నిర్వహించవచ్చు.
బంధువులు:
సొంత సోదరులు లేని పక్షంలో తండ్రి సోదరులు ఈ కర్మలు చేయవచ్చు. వారూ లేకపోతే కుటుంబంలోని ఇతర సన్నిహిత సభ్యులు లేదా దాయాదులు ఈ బాధ్యత తీసుకోవచ్చు.
అకాల మరణం - ప్రత్యేక పూజలు
పెళ్లి కాకుండా మరణించడాన్ని లేదా యవ్వనంలోనే ప్రాణాలు కోల్పోవడాన్ని హిందూ ధర్మం అసంపూర్ణ జీవితంగా పరిగణిస్తుంది. ఇటువంటి ఆత్మలు త్వరగా మోక్షం పొందవని నమ్మకం. అందుకే వీరి కోసం కొన్ని ప్రత్యేక విధులను సూచించారు:
నారాయణ బలి
అకాల మరణం చెందిన వారి ఆత్మ ప్రేత లోకం నుంచి విముక్తి పొంది పితృ' లోకానికి చేరుకోవడానికి నారాయణ బలి అనే ప్రత్యేక కర్మను నిర్వహించాలని గరుడ పురాణం చెబుతోంది.ఈ కర్మలు చేయడం వల్ల మరణించిన వ్యక్తికి పితృ దేవతల ఆశీస్సులు లభిస్తాయని, ఆ కుటుంబానికి పితృ దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు వివరిస్తున్నారు. మరణించిన వ్యక్తికి బంధుత్వం కన్నా, వారు మోక్షం పొందాలనే సంకల్పం ముఖ్యం. శాస్త్రం నిర్దేశించిన నియమాల ప్రకారం కర్మలు నిర్వహించడం వల్ల ఆ ఆత్మకు శాంతి చేకూరుతుంది.