Dharmapuri: ధర్మపురి కి పొతే యమపురి ఉండదు
యమపురి ఉండదు;
Dharmapuri: ధర్మపురికి పొతే యమపురి ఉండదని మన పెద్దలు చెబుతుంటారు. ఈ ఆలయం జగిత్యాల జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ లక్ష్మీనృసింహుడు యోగనారసింహుడిగా, ఉగ్ర నారసింహుడిగా రెండు అవతారాల్లో కొలువై ఉన్నాడు. గోదావరి నదీతీరాన ఈ క్షేత్రరాజం ఉంది. పూర్వకాలములో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గూర్చి తపమాచరించగా, నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నారసింహుడుగా ఈ క్షేత్రమందు అవతరించారు.
ధర్మపురి క్షేత్రం పితృకర్మలకు, కుజదోష నివారణకు ప్రసిద్ధము. కుజదోషమున్న వారు ఈ క్షేత్రమందు స్వామివారికి కళ్యాణము చేయించిన వారి కుజదోష నివారణము జరిగి శీఘ్రంగా వివాహమవటం ఇక్కడి క్షేత్ర మహాత్మ్యం. సాధారణంగా కుజదోషం అంటే వివాహానికి ముందే దానికి సంబంధించిన పరిహారక్రియలు చేసుకోవటం చేస్తుంటారు. కొన్ని సార్లు కుజదోషం ఉన్నట్లు తెలియక వివాహం చేసుకోవటం జరుగుతుంది.
అటువంటి సందర్భాల్లో వివాహానంతరం వైవాహిక జీవితం సమస్యల పాలవటం కద్దు. ధర్మపురి క్షేత్రం వివాహానంతరం కుజదోషం కారణంగా వచ్చే సమస్యలకు మంచి పరిహారం. దంపతులు ఇక్కడ గోదావరి తీరంలో సరిగంగ స్నానాలాడి, స్వామివారిని అర్చించినచో ఎటువంటి వైవాహిక సమస్యలైనా ఇట్టే తొలగిపోతాయి. యమలోకం లో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమ ధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరి లో స్నానం చేసి స్వామి వారిని దర్శించుకొని ఆలయం లో నివాసం ఎర్పర్చుకున్నట్లు పురాణం గాథలు చెబుతున్నాయి .