Kalyana Srinivasa Swamy: నారాయణవనంలోని శ్రీ పద్మావతి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం స్వామివారు మోహినీ అలంకారంలో పల్లకిపై దివ్యంగా విహరించి భక్తులకు కనువిందు చేశారు.

ఉదయం 8 గంటలకు గ్రామ వీధుల్లో విహరించిన స్వామివారు భక్తులను అనుగ్రహిస్తూ కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో గోవింద నామస్మరణ చేస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి పల్లకి సేవ అత్యంత వైభవంగా సాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు.

మోహినీ అవతార మహిమ

అసురులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని అందించేందుకు శ్రీమహావిష్ణువు మోహినీ అవతారాన్ని ధరించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. మోహినీ అలంకారంలో శ్రీనివాసుని దర్శించుకున్న భక్తులు మాయా బంధాలను అధిగమించి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తోంది.

రాత్రికి గరుడవాహన సేవ

బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన గరుడవాహన సేవ సోమవారం రాత్రి 7 గంటల నుండి జరగనుంది. గరుడునిపై కొలువుదీరే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.

Tags: