Yama Dwitiya 2026: యమ ద్వితీయ 2026: సోదరి చేతి భోజనం చేస్తే అపమృత్యు భయం తొలగుతుందా? పురాణ కథ ఇదే!
పురాణ కథ ఇదే!
Yama Dwitiya 2026: కార్తిక శుద్ధ విదియ రోజున జరుపుకునే యమ ద్వితీయ లేదా భగినీ హస్త భోజనం, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల ప్రేమకు చిహ్నం. ఈ ఏడాది నవంబర్ 11, బుధవారం నాడు ఈ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీపావళి ముగిసిన రెండో రోజు వచ్చే ఈ సంప్రదాయంలో సోదరులు సోదరుల ఇళ్లకు వెళ్లి, వారి చేతి వంట తిని, తిలకం దిద్దించుకుంటారు. ఒకరికొకరు కానుకలు ఇచ్చిపుచ్చుకుంటూ కుటుంబ బంధాలను బలోపేతం చేసుకుంటారు. ఉత్తర భారతంలో భాయ్ దూజ్గా, నేపాల్లో భాయ్ టికాగా ప్రసిద్ధి చెందిన ఈ పండుగకు పురాణ కథ ఉంది.
సూర్యుని కుమారుడు యమధర్మరాజు, కుమార్తె యమున. యమునకు సోదరుడంటే వల్లమాలిన అభిమానం. వివాహం తర్వాత దూరంగా ఉన్న యమున అన్నను ఎన్నిసార్లు పిలిచినా పనుల ఒత్తిడితో యముడు రాలేకపోయాడు. సోదరుడు తన ఇంటికి రావాలని యమున సూర్యుని ప్రార్థించగా, సూర్యుడు శివుని సహాయంతో అవకాశం కల్పించాడు.
అల్పాయుష్కుడైన మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని పూర్ణాయుష్షు కోసం ప్రార్థించగా, యముడు విసిరిన పాశం లింగాన్ని తాకింది. ఆగ్రహించిన శివుడు మార్కండేయుని చిరంజీవిగా చేసి, త్రిశూలంతో యముని తరుమాడు. రక్షణ కోసం ముల్లోకాలు తిరిగిన యముడు అనుకోకుండా సోదరి యమున ఇంటికి చేరాడు. ఆనందంతో యమున స్వహస్తాలతో భోజనం పెట్టింది. సోదరుల అనుబంధాన్ని చూసిన శివుడు, ఆ భోజనం చేసిన వారిని సంహరించరాదని వెనక్కి వెళ్లాడు. సూర్యుడు యమునకు ఇచ్చిన వరం ఫలించింది.
ఈ కారణంగా యమ ద్వితీయ రోజు సోదరి చేతి భోజనం తిన్నవారికి అపమృత్యు దోషాలు తొలగుతాయని నమ్మకం. సోదరుడు సోదరికి చీర, సారె వంటి కానుకలు ఇవ్వడం కూడా సంప్రదాయమైంది. ఈ పండుగ ద్వారా ఏడాదికోసారైనా తోబుట్టువులు కలుసుకుని, అనుబంధాన్ని దృఢపరుచుకుంటారు.
యమ ద్వితీయను తోబుట్టువులతో ఆనందంగా జరుపుకుందాం. అపమృత్యు దోషాలు తొలగించుకుందాం.
శుభం భూయాత్!