Karthika Masotsavams: శ్రీశైలంలో నేటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
కార్తీక మాసోత్సవాలు ప్రారంభం
Karthika Masotsavams: హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించే కార్తీక మాసోత్సవాలు శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి (అక్టోబర్ 22, 2025) వైభవంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు నవంబర్ 21 వరకు కొనసాగనున్నాయి. కార్తీక మాసం సందర్భంగా శివారాధన కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, సాధారణ దర్శనాలను వేగవంతం చేసేందుకు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం కీలక మార్పులు చేసింది. కార్తీక మాసం మొత్తం శ్రీ స్వామివారి గర్భాలయ అభిషేకం మరియు సామూహిక అభిషేకం టికెట్లు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. ప్రతి శని, ఆది, సోమవారాలు, ప్రభుత్వ సెలవులు, కార్తీక పౌర్ణమి రోజుల్లో మల్లన్న స్పర్శ దర్శనం పూర్తిగా నిలుపుదల చేశారు. రద్దీ తక్కువగా ఉన్న ఇతర రోజుల్లో (మంగళవారం నుంచి శుక్రవారం వరకు) విడతల వారీగా (బ్యాచ్‌లలో) స్పర్శ దర్శనం కల్పిస్తారు. శని, ఆది, సోమవారాలతో సహా రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో అమ్మవారి అంతరాలయ కుంకుమార్చనలను ఆశీర్వచన మండపంలో నిర్వహిస్తారు. అభిషేకాలు రద్దు చేయడంతో దర్శనాలు వేగంగా జరుగుతాయని, ఉదయం 5:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఆలయ పుష్కరిణి (కోనేరు) వద్ద లక్ష దీపోత్సవం వైభవంగా నిర్వహించబడుతుంది. నవంబర్ 14న ఆలయంలో కోటి దీపోత్సవం జరగనుంది. నవంబర్ 18న శ్రీ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం నిర్వహించబడుతుంది. దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) ఎం. శ్రీనివాసరావు భక్తులు ఈ మార్పులను గమనించి, సహకరించి, వీలైనంత త్వరగా దర్శనం పూర్తి చేసుకునేందుకు వేకువజామునే ఆలయానికి చేరుకోవాలని సూచించారు. కార్తీక మాసంలో పూజలు, వ్రతాలు, ఉపవాసాలపై మరిన్ని వివరాల కోసం భక్తులు శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు.