Karthika Pournami 2026 on November 24: ఏడాదిలో వచ్చే పన్నెండు పౌర్ణముల్లో కార్తీక పౌర్ణమి అత్యంత పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. దీనిని మరో మహాశివరాత్రిగా పరిగణిస్తారు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి నవంబర్ 24వ తేదీ (మంగళవారం) నాడు జరుపుకోనున్నారు.

పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 23వ తేదీ రాత్రి 11.42 గంటలకు ప్రారంభమై నవంబర్ 24వ తేదీ రాత్రి 8.23 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం వేళ ఏ తిథి ఉంటే దానినే పరిగణించడం వల్ల నవంబర్ 24వ తేదీనే ఈ పర్వదినాన్ని ఆచరిస్తారు.

ఈ పవిత్ర రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి సముద్రం లేదా నదీ స్నానం చేయాలి. నదికి వెళ్లలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేసి ఉపవాస సంకల్పం తీసుకోవాలి. శివలింగానికి పాలు, పెరుగు, తేనె, గంగాజలంతో అభిషేకం చేసి బిల్వ పత్రాలు సమర్పించాలి. మహావిష్ణువును పూజిస్తే తులసీ దళాలు సమర్పించాలి. అనంతరం కార్తీక పురాణం పఠించాలి.

సాయంత్రం ప్రదోష కాలంలో 360 వత్తులతో దీపం వెలిగించాలి. ఆవు నెయ్యిలో తడిపిన వత్తులను ఉపయోగించాలి. తులసి కోట లేదా ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి. నదులు, చెరువులు, కోనేటిలో అరటి దొప్పలో మట్టి ప్రమిదలు ఉంచి దీపాలు వదలాలి. శివాలయాల్లో నిర్వహించే జ్వాలాతోరణం దర్శించి ఆ మంటల కింద నడవడం వల్ల గ్రహబాధలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

ఈ వత్తులను అగ్గిపుల్లతో లేదా కొవ్వొత్తితో వెలిగించకూడదు. అగరబత్తిని ఉపయోగించి వెలిగించాలి. 365 వత్తులతో దీపారాధన చేయడం వల్ల ఇంటి యజమానికి అత్యుత్తమ ఫలితాలు లభిస్తాయి. దీపారాధన తర్వాత అక్షింతలు వేసి దామోదరం ఆవాహయామి లేదా త్రయంబకం ఆవాహయామి అని చెప్పుకోవాలి.

ఈ పౌర్ణమి నాడు చాలా మంది ఉసిరికాయలతో దీపారాధన చేస్తారు. ఉసిరికాయలో ఆవు నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.

రాత్రి చంద్రుడిని దర్శించి అర్ఘ్యం సమర్పించాలి. చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పించి ఉపవాసం విరమించాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. నువ్వులు, దీపాలను దానం చేయడం వల్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు.

ఈ రోజు మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. పరుష పదాలు వాడకుండా ఉండాలి. కార్తీక పౌర్ణమి నాడు శివుని, విష్ణువుని ఆరాధించడం, దీపదానం చేయడం ద్వారా సకల పాపాలు తొలగి ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు.

Tags: