Laksha Deepotsavam: వరంగల్లో కార్తీక పౌర్ణమి వేడుకలు.. వేయిస్తంభాల ఆలయం సహా పలు దేవాలయాల్లో లక్ష దీపోత్సవం
| దేవాలయాల్లో లక్ష దీపోత్సవం
Laksha Deepotsavam: కార్తీక మాసంలో కనులపండువ చేసే పౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో జరిగే ప్రధాన వేడుకల్లో పౌర్ణమి ఘట్టం ప్రత్యేకం. ప్రతి ఇంటా బ్రహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామునే లేచి ఉసిరిక స్నానాలు చేసి కార్తీక వత్తులు వెలిగించుకుంటారు. ఆలయాల్లో కార్తీక దీపాలు వెలిగించి, ఉసిరిక దానాలు చేస్తారు. ఇంటింటా తులసి మాతను లక్ష్మీదేవిగా కొలుస్తూ కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. ప్రతి ఇంటా దీపావళి నుంచి మొదలైన కార్తీక దీపాలు పౌర్ణమి వేళ మరిన్ని ఎక్కువగా వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ సుఖ సంతోషాల కోసం పూజించడం ఈ పర్వం విశిష్టత. కార్తీక దీపాల ద్వారా మనిషిలోని అజ్ఞానం తొలగి జ్ఞాన జ్యోతులు వెలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.
కార్తీక పౌర్ణమి వేళ హనుమకొండలోని చారిత్రక వేయిస్తంభాల గుడిలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండలోని ప్రసిద్ధ షిర్డీ సాయిబాబా ఆలయం, ములుగు రోడ్డులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయం, దత్తక్షేత్రం, కాజీపేటలోని శ్వేతార్కమూల గణపతి ఆలయం, రాగన్న దర్వాజలోని శ్రీ సీతారామ ఆలయం, చిన్నకోవెల, ఎక్సైజ్ కాలనీలోని వేంకటేశ్వరాలయం, బాలసముద్రంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీలు ఏర్పాట్లు చేశాయి. ములుగు రోడ్డులోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం, వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు. రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో పౌర్ణమి పూజలతో పాటు శివాలయాల్లో రుద్ర అభిషేకం నిర్వహిస్తున్నారు. సాయంత్రం అన్ని దేవాలయాల్లో దీపోత్సవం జరుగుతుంది.
ఆంజనేయస్వామి వారికి చందనం, ఆకు పూజలు, పంచామృతం అభిషేకం, వడమాలలు, తమలపాకుల పూజ నిర్వహిస్తారు. ఇళ్లల్లో ఉసిరి కొమ్మ ఏర్పాటు చేసి పూజ చేస్తారు. శ్రీగౌరీ కేదారేశ్వర వ్రతం ఆచరించుకుంటారు. ఉదయం, సాయంత్రం ఇళ్లల్లో, ఆలయాల్లో ఉసిరికాయ దీపాలు వెలిగిస్తారు. సాయంత్రం ఉసిరి చెట్టు కింద భోజనాలు చేస్తారు. ఆలయాల్లో 365 వత్తులు కాలుస్తారు. కొందరు వన భోజనాలకు వెళ్తారు. కార్తీక పౌర్ణమి వేళ తులసి వద్ద భక్తితో వెలిగించే ఉసిరిక దీపాల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి ఉసిరి కొమ్మలతో తరలివచ్చిన అమ్మంకాదురులు, వినియోగదారులతో నగరమంతా సందడిగా మారింది.ప్రధాన వాణిజ్య కూడళ్లు హనుమకొండ, వరంగల్ చౌరస్తాలతో పాటు అనేక ప్రధాన కూడళ్ల వద్ద ఉసిరి కొమ్మలు, మామిడి ఆకులు, బంతి, చామంతి, గులాబీ పూల వినియోగదారులతో కిక్కిరిసిపోయాయి.
పంచాంగం ప్రకారం పౌర్ణమి తిథి నవంబర్ 23 రాత్రి 11:42 గంటలకు ప్రారంభమై, నవంబర్ 24 సాయంత్రం 8:23 గంటల వరకు ఉంటుంది. ఈ రోజు శివుడు త్రిపురాసురులను సంహరించిన త్రిపురారి పౌర్ణమిగా కూడా ప్రసిద్ధి. భక్తులు నదీ స్నానం, దీపారాధన, దానాలతో పుణ్యం సంపాదించుకుంటున్నారు.