Krishna’s Secret to Success: కృష్ణుడు చెప్పిన 'సక్సెస్' మంత్రం ఇదే!
'సక్సెస్' మంత్రం ఇదే!
Krishna’s Secret to Success: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో గెలుపు కోసం అందరూ ఆరాటపడుతున్నారు. కానీ, ఆ గెలుపు రాకపోతే కుంగిపోతున్నారు. సరిగ్గా ఇలాంటి సందిగ్ధంలో ఉన్న అర్జునుడికి, శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన మంత్రమే.. "కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన". అంటే "నీ పని చేయడం వరకే నీ అధికారం, ఫలితం మీద కాదు" అని అర్థం. అసలు ఫలితం ఆశించకుండా పని చేయడం సాధ్యమేనా? కృష్ణుడు అలా ఎందుకు చెప్పాడు? దీని వెనుక ఉన్న అసలు లాజిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనం ఏదైనా పని చేసేటప్పుడు రిజల్ట్ ఎలా వస్తుందో?"అని భయపడుతుంటే, మన దృష్టి పని మీద కంటే ఫలితం మీద ఎక్కువ ఉంటుంది. దీనివల్ల పనిలో నాణ్యత తగ్గుతుంది. ఫలితాన్ని వదిలేసి, చేసే పనిని ప్రేమిస్తే.. మన వంద శాతం శ్రమను ఆ పని మీద పెట్టగలం. అప్పుడు ఫలితం ఆటోమేటిక్‌గా బాగుంటుంది.
మనం ఒక ఫలితాన్ని బలంగా కోరుకుని, అది రానప్పుడు తీవ్రమైన నిరాశకు లోనవుతాం. అదే "నేను నా వంతు ప్రయత్నం చేశాను" అన్న తృప్తి ఉంటే, ఓటమి ఎదురైనా మళ్ళీ ధైర్యంగా ముందుకు వెళ్ళగలం. ఫలితంపై ఆశ లేకపోవడం అంటే నిరుత్సాహపడటం కాదు, ఫలితాన్ని స్వీకరించే మానసిక స్థితిని కలిగి ఉండటం. కృష్ణుడు చెప్పిన అసలు రహస్యం ఏంటంటే.. పని చేయడం మన చేతుల్లో ఉంటుంది, కానీ ఫలితం అనేక బాహ్య అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీరు పరీక్షకు బాగా చదవడం మీ వంతు. కానీ పేపర్ కఠినంగా రావడం, దిద్దే వారి మూడ్ వంటివి మీ చేతుల్లో లేవు. మీ చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దని కృష్ణుడి ఉద్దేశ్యం. "నేనే చేశాను.. నా వల్లే ఈ సక్సెస్ వచ్చింది" అనే అహంకారం మనిషిని పతనానికి దారి తీస్తుంది. ఫలితాన్ని దైవానికి లేదా ప్రకృతికి వదిలేయడం వల్ల మనిషి వినయంగా ఉండగలుగుతాడు.
ఈ కాలంలో విద్యార్థులు, ఉద్యోగులు అందరూ టార్గెట్ల వెనుక పరిగెడుతున్నారు. ఫలితం ఆశించకు అంటే దాని అర్థం జీతం వద్దనో, ప్రమోషన్ వద్దనో కాదు.. పని చేస్తున్న సమయంలో కేవలం పని మీద మాత్రమే దృష్టి పెట్టు అని. ఫలితం గురించి అతిగా ఆలోచించి సమయాన్ని, శక్తిని వృథా చేయవద్దని గీతా సారం. విత్తనం నాటడం మన పని.. అది మొలకెత్తి చెట్టు కావడానికి గాలి, నీరు, సూర్యరశ్మి వంటి ఎన్నో శక్తులు తోడవ్వాలి. మనం చేయాల్సింది కేవలం ఆ విత్తనానికి నీరు పోయడమే!