Nandi: పౌరాణిక కథనాల ప్రకారం నందీశ్వరుడు శివభక్తికి, ధర్మానికి, అచంచల నిష్ఠకు ప్రతీక. శిలాదుడు అనే మహర్షి సంతానం కోసం పరమశివుడిని గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. తనకు పుత్రుడిని అనుగ్రహించమని కోరుకున్నాడు శిలాదుడు.

కొంతకాలానికి శిలాదుడు యజ్ఞం కోసం భూమిని దున్నుతుండగా దివ్య తేజస్సుతో ఉన్న బాలుడు కనిపించాడు. అతడికి ‘నంది’ అని పేరుపెట్టి ఎంతో ప్రేమతో పెంచుకున్నాడు. నంది చిన్నతనం నుంచే వేదాలు, శాస్త్రాలు అభ్యసించాడు. అతడు మహా శివభక్తుడిగా పేరుగాంచాడు. ఒకరోజు వరుణుడు, మిత్రుడు అనే దేవతలు శిలాదుడి ఆశ్రమానికి వచ్చారు. నందిని చూసి అతడు అల్పాయుష్కుడని శిలాదుడికి తెలియజేశారు.

వారి మాటలు విన్న శిలాదుడు ఎంతగానో దుఃఖించాడు. తండ్రి బాధను చూసిన నంది తాను పరమశివుడిని ప్రసన్నం చేసుకుంటానని చెప్పాడు. వెంటనే కఠోర తపస్సు ఆరంభించాడు. నంది అంతులేని భక్తికి, అచంచల దీక్షకు శివుడు సంతోషించాడు. పార్వతీసమేతంగా ప్రత్యక్షమయ్యాడు. తనకు అత్యంత సన్నిహితుడిగా ఉండే భాగ్యాన్ని ప్రసాదించి, చిరంజీవిగా ఉండమని వరమిచ్చాడు.

నందికి దివ్యమైన రూపాన్ని, అపార శక్తిని అనుగ్రహించాడు. తన వాహనంగా స్థానం కల్పించాడు. శివగణాలకు నాయకుడిగా నియమించాడు. అప్పటి నుంచి నంది కైలాసంలో శివపార్వతుల సేవలో నిరంతరం ఉండే భాగ్యాన్ని పొందాడు. శివాలయాల్లో గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు.

నంది చెవిలో తమ కోరికను చెబితే ఆయన శివుడికి చేరవేస్తాడని, అది నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. నందీశ్వరుడు పరమశివుడికి వాహనమే కాదు, ధర్మానికి, భక్తికి, నిష్ఠకు ప్రతీకగా నిలిచాడు. శివుడిపై ఆయనకున్న అచంచల భక్తివిశ్వాసాలు మనకు ఆదర్శం. శివసన్నిధిలో శాశ్వత స్థానం పొందిన నందికి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తే భగవంతుడి అనుగ్రహం లభిస్తుందని నందీశ్వరుడి కథ తెలియజేస్తుంది.

Tags: