Divine Instrument: ఏ పుణ్యక్షేత్రంలోనైనా దైవదర్శనం చేసుకునే సమయంలో భక్తులు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. దైవకృపతో భయాందోళనల నుంచి విముక్తి పొందగలమనే విశ్వాసమే ఆ అనుభూతికి మూలం. అయితే దర్శన అవకాశం ఎక్కువ సేపు కలిగితే ఆ అనుభూతి గాఢంగా ఉండదు. నెమ్మదిగా లౌకిక ఆలోచనలు చోటు చేసుకుంటాయి. ఈ మార్పు భక్తుడి మానసిక స్థితి, విశ్వాసం బలం మీద ఆధారపడి ఉంటుంది. దైవశక్తి ముందు అహాన్ని విడిచి ‘నేను అల్పుడిని’ అనే భావన ఉన్నంత కాలం ఆ దివ్యానుభూతి కొనసాగుతుంది.


భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానాన్ని రేడియో, టీవీ లాంటి ప్రసార సాధనాలతో పోల్చవచ్చు. ప్రసారం చేసే సాధనం (ట్రాన్స్‌మిటర్) నుంచి సందేశాలు నిరంతరం వెలువడుతూ ఉంటాయి. అయితే వాటిని గ్రహించే సామర్థ్యం గ్రాహకం (రిసీవర్) స్విచ్ ఆన్‌లో ఉండి సంకేతాలను అందుకోవడానికి సిద్ధంగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది. స్విచ్ ఆఫ్‌లో ఉన్న గ్రాహకానికి ప్రసార కేంద్రం దగ్గరే ఉన్నా ఫలితం లేదు.


అదేవిధంగా పరమాత్మ విశ్వవ్యాపకంగా ఉండే దివ్యశక్తి ప్రసార కేంద్రం. సకల జీవజాలం ఆ శక్తిని గ్రహించే సాధనాలే. మనిషికి మాత్రమే ఆ దివ్యశక్తితో అనుసంధానం చేసుకునే సామర్థ్యం, వివేకం ఉన్నాయి. యోగాభ్యాసంలో ధ్యాన ప్రక్రియ ద్వారా ఈ అనుసంధానం జరుగుతుంది. అచంచలమైన విశ్వాసమే దానికి మొదటి మెట్టు.


దైవస్తుతిలో ఆయన గుణగణాలను, ఔన్నత్యాన్ని ఆదర్శంగా తీసుకుని తనలో ఆ దైవిక లక్షణాలను పెంచుకునేకొద్దీ భక్తుడు దైవానికి ప్రీతిపాత్రుడవుతాడు. సృష్టికి తల్లి, తండ్రి, గురువు అన్నీ ఆ పరమాత్మే. ఆయన దిశానిర్దేశాలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు ఆయన అభయం తప్పక లభిస్తుంది. ఎక్కడ ఉన్నా విశ్వాసంతో సర్వాంతర్యామితో అనుసంధానం సాధించి, దాన్ని ఇతరుల శ్రేయస్సుకు ఉపయోగిస్తూ జీవితాన్ని సార్థకం చేసుకోవడమే అందరికీ అభిలషణీయం.

Tags: