Navratri Fasting: శరన్నవరాత్రి ఉత్సవాల వేళ అమ్మవారి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తొమ్మిది రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపడుతుంటారు. కొందరు రోజంతా కేవలం పూజలకే పరిమితమై ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటే, మరికొందరు పండ్లు, పాలు, తేలికపాటి ఆహారాలతో ఉపవాసం ఉంటారు. కుటుంబ సంప్రదాయాలు, వ్యక్తిగత విశ్వాసాలు, ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉపవాస పద్ధతులు మారినప్పటికీ.. ఈ సమయంలో సరైన ఆహార నియమాలు పాటించకపోతే శరీరం బలహీనపడే ప్రమాదం ఉంది. భక్తితో పాటు ఆరోగ్యాన్నీ కాపాడుకునేందుకు ఉపవాస సమయంలో నిపుణులు సూచిస్తున్న కీలక అంశాలు ఇవే.

ఉపవాసంలో ఏం తీసుకోవచ్చు?

ఉపవాస సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలు, శక్తి అందేలా ఆహార ఎంపికలు చేసుకోవాలి.

తాజా పండ్లు: అరటిపండు, ఆపిల్, బొప్పాయి, నారింజ, దానిమ్మ వంటి పండ్లు శరీరానికి తక్షణ శక్తిని, అవసరమైన నీటి శాతాన్ని, విటమిన్లను అందిస్తాయి.

పాలు, పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్, కాల్షియం అందుతాయి. పాలు పడని వారు పెరుగు లేదా మజ్జిగను ఎంచుకోవచ్చు.

డ్రై ఫ్రూట్స్ (నట్స్): బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటి గింజలను మితంగా తీసుకోవడం ద్వారా శరీరానికి రోజంతా కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులు, శక్తి లభిస్తాయి.

సాంప్రదాయ ఉపవాస ఆహారాలు: సగ్గుబియ్యం (సబ్బక్కి), చిలగడదుంపలు, బంగాళదుంపలు, సమక్ బియ్యం వంటి వాటిని వండుకునేటప్పుడు నూనె, నెయ్యి వాడకం చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటికి బదులు పండ్లు, పెరుగు ఎక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం.

డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు

కొందరు ఉపవాసం పేరిట బొట్టు నీరు కూడా ముట్టకుండా కఠిన నియమాలు పాటిస్తారు. అయితే ఇది అందరి శరీర తత్వాలకు సరిపడదు. శరీరంలో నీటి శాతం తగ్గితే తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసం, అలసట మరియు మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి నీరు తాగడానికి వెసులుబాటు ఉన్న ఉపవాస నియమాలను పాటించేవారు రోజంతా సరిపడా మంచి నీటిని, కొబ్బరి నీళ్లు లేదా మజ్జిగ రూపంలో ద్రవాహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం.

ఉపవాసం విరమించేటప్పుడు చేయకూడని తప్పులు

ఉపవాసం ముగియగానే ఒక్కసారిగా కడుపునిండా భారీగా ఆహారం తినడం అస్సలు మంచిది కాదు.

రోజంతా ఖాళీగా ఉన్న జీర్ణవ్యవస్థపై ఒక్కసారిగా ఒత్తిడి పడకుండా ఉండేందుకు తేలికపాటి ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి.

అధిక ఉప్పు, తీపి ఎక్కువగా ఉండే పానీయాలు, డీప్ ఫ్రై చేసిన చిరుతిళ్లకు దూరంగా ఉండాలి.

భోజనం చేసే సమయాలు, పరిమాణంపై దృష్టి సారిస్తే శరీరంలో శక్తి స్థాయిలు నిలకడగా ఉంటాయి.

భక్తితో పాటు శరీరానికీ గౌరవం

నవరాత్రి ఉపవాసం అంటే కేవలం ఆకలితో అలమటించడం మాత్రమే కాదు; అది క్రమశిక్షణ, అంతర్గత పరిశుభ్రత, భక్తికి ప్రతీక. భక్తిని చాటుకుంటూనే శరీర అవసరాలను గుర్తించాలి. ఆహారాన్ని పూర్తిగా మానేసి నీరసించిపోయే బదులు, మీ శరీరానికి తగిన పోషకాలను అందిస్తూ సమతుల్యంగా ఉపవాసం పాటించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యాన్నీ పొందవచ్చు.

Tags: