Offer Five Stones to This Goddess: భారతదేశంలో ఎన్నో శక్తి పీఠాలు ఉన్నాయి. అమ్మవారికి భక్తులు కిలోల కొద్దీ బంగారం, పట్టు చీరలు, ఖరీదైన కానుకలు సమర్పించడం మనం చూస్తుంటాం. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా దట్టమైన అడవుల మధ్య కొలువై ఉన్న మా బాగ్దాయి ఆలయం మాత్రం వీటన్నింటికీ భిన్నం. ఇక్కడ అమ్మవారికి సమర్పించాల్సింది విలువైన వస్తువులు కాదు.. కేవలం ఐదు రాళ్లు, ఒక పువ్వు.. వినడానికి వింతగా ఉన్నా, శతాబ్దాలుగా ఈ ఆచారం ఇక్కడ కొనసాగుతోంది.

గొర్రెల కాపరి భక్తి నుంచి పుట్టిన ఆచారం

ఈ విలక్షణమైన సంప్రదాయం వెనుక ఒక మనసుకు హత్తుకునే కథ ఉంది. జానపద కథల ప్రకారం.. సుమారు వంద సంవత్సరాల క్రితం, ఒక పేద గొర్రెల కాపరి అడవిలో గొర్రెలను కాస్తుండగా అతనికి దేవత సజీవ విగ్రహం కనిపించింది. తనను అక్కడే ప్రతిష్ఠించమని ఆ దేవత అతడిని కలలో కోరింది. అమ్మవారి ఆజ్ఞ మేరకు ఆ భక్తుడు ఆలయాన్ని నిర్మించాడు కానీ, పూజ చేయడానికి అతని వద్ద కొబ్బరికాయ కొనే శక్తి కూడా లేదు. తన పేదరికాన్ని తలచుకుని ఏడుస్తున్న ఆ భక్తుడిని అమ్మవారు ఓదార్చి.. "నాకు ఆడంబరాలు వద్దు, నీ స్వచ్ఛమైన ప్రేమే చాలు. అడవిలో దొరికే ఐదు రాళ్లను భక్తితో సమర్పించు" అని పలికింది. నాటి నుండి నేటి వరకు ఇక్కడ రాళ్లే మహాప్రసాదంగా మారాయి.

మొక్కు తీర్చే విధానం కూడా ప్రత్యేకమే

ఈ ఆలయంలో భక్తులు తమ కోరికలను కోరుకుంటూ అమ్మవారి పాదాల చెంత ఐదు రాళ్లు, ఒక పువ్వు ఉంచుతారు. ఒకవేళ వారి కోరికలు నెరవేరితే, కృతజ్ఞతగా మళ్ళీ ఆలయానికి వచ్చి మరో ఐదు రాళ్లను సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని కష్టాలు తీరి, దుష్ట శక్తులు నశిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ రాళ్లు భక్తికి, నమ్మకానికి చిహ్నంగా మారాయి.

నవరాత్రుల్లో ఆధ్యాత్మిక శోభ

ప్రతి ఏటా చైత్ర, శరన్నవరాత్రుల సమయంలో ఈ అడవి ప్రాంతం భక్తులతో కిక్కిరిసిపోతుంది. దట్టమైన చెట్ల నీడలో, ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయం నవరాత్రుల తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా కనిపిస్తుంది. ఎంతో మంది భక్తులు పాదయాత్రగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.

డబ్బు, హోదా కంటే భక్తి మాత్రమే ప్రధానమని మా బాగ్దాయి ఆలయం చాటిచెబుతోంది. ఆడంబరాలకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉన్న ఈ ఆలయ విశిష్టత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక ప్రేమికులను ఆకర్షిస్తోంది.

Tags: