Ontimitta Sri Kodandarama Swamy Temple: ఏప్రిల్ 01వ తారీఖున ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతా రాముల‌ కల్యాణానికి విచ్చేసే భ‌క్తుల‌కు అందించేందుకు 85 వేల తిరుమల శ్రీవారి లడ్డూలు సిద్ధమయ్యాయి.

తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ – 1లో శ్రీవారి సేవ‌కుల‌ సహకారంతో లడ్డూల ప్యాకింగ్‌ను ఆదివారం టీటీడీ ఒక బృహత్కార్యక్రమంగా నిర్వహించింది.

ఈ లడ్డూల ప్యాకింగ్ కార్యక్రమంలో సుమారు 300 మంది శ్రీవారి సేవకులు అపార భక్తి, శ్రద్ధలతో పాల్గొన్నారు.

తిరుమల ఎస్టేట్స్ అధికారి,డిప్యూటీ ఈవో (పరకామణి ఇన్‌ఛార్జ్) శ్రీ వెంకటేశ్వరులు ఆధ్వర్యంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట వరకు నిరంతరాయంగా సాగింది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్. నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సీహెచ్ వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు సుమారు 200 మంది మహిళా సేవకులు, 100 మంది పురుష సేవకులు కలిసి ఐదు గంటలపాటు అంకితభావంతో సేవలందించారని తెలిపారు.

లడ్డూల ప్యాకింగ్, లోడింగ్, రవాణా వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ శ్రీవారి సేవా సదన్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.

Tags: