Kapileswara Swamy Temple: కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు
అంకురార్పణతో ప్రారంభమైన పవిత్రోత్సవాలు;
Kapileswara Swamy Temple: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో 09వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు ఆదివారం సాయంత్రం 06.00 గంటలకు అంకురార్పణ నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూలై 07న మొదటిరోజు సోమవారం ఉదయం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం, సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. జూలై 08న రెండో రోజు ఉదయం గ్రంథి పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలపూజ, హోమం చేపడతారు.
జూలై 09న ఉదయం మహాపూర్ణాహుతి, కలశోధ్వాసన, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్లు పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
రెండుసార్లు గరుడ వాహన సేవ
మరోవైపు తిరుమలలో జూలై మాసంలో గురు పౌర్ణమి, గరుడ పంచమి పర్వదినాలను పురస్కరించుకొని టీటీడీ రెండుసార్లు గరుడ వాహన సేవ నిర్వహించనుంది. జూలై 10న గురు పౌర్ణమి, జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు గరుడ వాహన సేవ జరగనుంది.