Performing Puja at Home: ఇంట్లో పూజ చేస్తున్నారా? నిలబడి కాకుండా కూర్చొని చేస్తేనే ఫలితం.. ఎందుకో తెలుసా?
ఎందుకో తెలుసా?
Performing Puja at Home: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది దేవుడి గదిలోకి వెళ్లి కేవలం రెండు నిమిషాల్లోనే మొక్కులు తీర్చేసుకుని బయటకు వచ్చేస్తుంటారు. మరికొందరు నిలబడే పూజ ముగించేస్తుంటారు. అయితే, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం పూజను ఇంత తొందరగా, నిలబడి చేయడం అస్సలు మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ప్రశాంతమైన భంగిమలో కూర్చుని పూజ చేయడం వల్లనే ఆ దైవ ప్రార్థన పూర్తి ఫలితాన్ని ఇస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
పూజ చేసేటప్పుడు కూర్చోవడం వెనుక ఉన్న ప్రాధాన్యత, దిశలు, పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిలబడి పూజ చేస్తే ఏమవుతుంది?
శాస్త్రాల ప్రకారం.. పూజ చేసేటప్పుడు మనస్సును ఏకాగ్రతతో ఉంచడం అత్యంత ముఖ్యం. మనం నిలబడి ఉన్నప్పుడు శరీరం, మనస్సు పూర్తిగా ఏకాగ్రతను కుదుర్చుకోలేకపోవచ్చు. దీనివల్ల ప్రార్థన యొక్క లోతు తగ్గుతుంది. భక్తి కంటే తొందరపాటు ఎక్కువగా ఉంటే పూజ వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా తగ్గిపోతాయి.
అలాగే కొన్ని ఇళ్లలో దేవతా విగ్రహాలను చాలా ఎత్తులో పెడుతుంటారు. దీనివల్ల నిలబడి పూజించాల్సి వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా విగ్రహాలను ఎక్కువ ఎత్తులో పెట్టడం అశుభంగా పరిగణించబడుతుంది. ఇది ఇంట్లో ఒక రకమైన అసౌకర్య భావనను, మానసిక అశాంతిని మరియు నెగిటివ్ ఎనర్జీని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూర్చొని ప్రార్థించడం వెనుక ఉన్న అర్థం:
పూజ అంటే మనసును పూర్తిగా దేవునికి అర్పించడం. కింద కూర్చొని ప్రార్థించడం వల్ల మనసు త్వరగా ప్రశాంతపడుతుంది. ఇది ధ్యానం, మంత్ర పఠనం మరియు జపం వంటి వాటిలో ఏకాగ్రతను పెంచుతుంది. పూజ చేసే సమయంలో ఒక ఆసనంపై కూర్చోవడం వల్ల శరీరంలోని ఆధ్యాత్మిక శక్తి భూమిలోకి వెళ్లిపోకుండా కాపాడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజ మొత్తం కూర్చొని చేసి, ముగింపులో ఇచ్చే హారతి సమయంలో మాత్రమే నిలబడటం మన సాంప్రదాయం.
-పూజలో భంగిమ - దిశల ప్రాముఖ్యత..
ఆసనం తప్పనిసరి:
పూజ చేసేటప్పుడు నేరుగా నేలపై కూర్చోకూడదు. చాప, పీట లేదా ఒక శుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించాలి. ఇది శరీరానికి స్థిరత్వాన్ని ఇస్తుంది.
దిశలు:
పూజ చేసేటప్పుడు మన ముఖం ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. భక్తుడు కూర్చునే స్థలం కంటే దేవుడి పీఠం కొద్దిగా ఎత్తులో ఉండాలి.
సామగ్రి అమరిక:
దీపం, గంట, అగరబత్తిని ఎల్లప్పుడూ కుడి వైపున ఉంచాలి. పువ్వులు, పండ్లు, శంఖం, నీటి పాత్రను ఎడమ వైపున ఉంచడం శుభప్రదం.
నిత్య పూజలో పాటించవలసిన నియమాలు:
పూజకు ఉపక్రమించే ముందు స్నానం చేసి, శుభ్రమైన సాంప్రదాయ బట్టలు ధరించాలి.
వంటగదిలో లేదా పడకగదిలో పూజ చేయడం కంటే, ప్రశాంతమైన ప్రదేశంలో దేవునికి ఒక ప్రత్యేక స్థానాన్ని లేదా గదిని ఏర్పాటు చేయడం ఉత్తమం.
పూజ పూర్తయిన తర్వాత.. "నా అజ్ఞానము వల్ల తెలిసీ తెలియక చేసిన తప్పులను క్షమించు" అని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడం మంచి అలవాటు.
సరైన పద్ధతిలో పూజిస్తే కలిగే ప్రయోజనాలు:
శాస్త్రోక్తంగా, ప్రశాంతమైన మనసుతో క్రమం తప్పకుండా చేసే పూజల వల్ల ఇళ్లలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యులలో మనశ్శాంతిని, ఆత్మవిశ్వాసాన్ని, పరస్పర ఐక్యతను, మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తుంది. కాబట్టి పూజ గదిలో కాసేపు ప్రశాంతంగా కూర్చొని దైవకృపకు పాత్రులు అవ్వండి.