Char Dham Yatra: చార్ ధామ్ యాత్రకు వెళ్లే వాళ్లు ముందు ఈ విషయం తెలుసుకోండి
ముందు ఈ విషయం తెలుసుకోండి
Char Dham Yatra: ఉత్తరాఖండ్ ప్రభుత్వం 2026 చార్‌ధామ్ యాత్రకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ,ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడటానికి ఆలయ ప్రాంగణాల్లోకి మొబైల్ ఫోన్లు ,కెమెరాలను తీసుకెళ్లడంపై పూర్తి నిషేధం విధించింది. భక్తులు గర్భగుడి లేదా ఆలయ ప్రాంగణంలో ఫోటోలు, సెల్ఫీలు,రీల్స్ తీయడం వల్ల క్యూ లైన్లు నెమ్మదించి, దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోందని అధికారులు గుర్తించారు. పుణ్యక్షేత్రాల ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టారు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్ల వాడకం వల్ల తోపులాటలు జరిగే అవకాశం ఉందని, భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కొత్త నిబంధనలు ఇవే (2026 యాత్ర నుంచి)
చార్‌ధామ్ క్షేత్రాలు: కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి , యమునోత్రి ఆలయ ప్రాంగణాల్లో ఈ నిషేధం వర్తిస్తుంది.
మొబైల్ కౌంటర్లు: భక్తుల సౌకర్యార్థం ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో (సింగ్ ద్వార్ వంటి ప్రదేశాల్లో) మొబైల్ ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు/లాకర్లను ఏర్పాటు చేస్తున్నారు.
నిబంధనల అమలు: నిబంధనలు ఉల్లంఘించి రీల్స్ లేదా వీడియోలు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గఢ్‌వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే హెచ్చరించారు.
ముఖ్య గమనిక
భక్తులు కేవలం ఆలయ బయట మాత్రమే ఫోటోలు లేదా వీడియోలు తీసుకోవడానికి అనుమతి ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్లేముందే తమ ఎలక్ట్రానిక్ వస్తువులను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది (2026) ఏప్రిల్ లేదా మే నెలలో ప్రారంభం కానున్న చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు ఈ నిబంధనలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.