Puri Jagannath’s ‘Prisoner’: పూరీ జగన్నాథుడి 'ఖైదీ': హనుమంతుడిని బంగారు గొలుసులతో ఎందుకు బంధించారో తెలుసా?
బంగారు గొలుసులతో ఎందుకు బంధించారో తెలుసా?
Puri Jagannath’s ‘Prisoner’: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి సంబంధించి ఎన్నో రహస్యాలు, వింతలు మనకు తెలుసు. అయితే అదే పూరీలో సముద్ర తీరానికి సమీపంలో హనుమంతుడు బందీగా దర్శనమిచ్చే ఒక విచిత్రమైన ఆలయం ఉందన్న విషయం మీకు తెలుసా? దీనినే స్థానికులు బేడి హనుమాన్ ఆలయం అని పిలుస్తారు. గాలిపుత్రుడు ఇక్కడ బంగారు గొలుసులతో బంధించబడి ఉండటం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది.
సముద్రాన్ని నియంత్రించేందుకు జగన్నాథుడి ఆజ్ఞ
పురాణాల ప్రకారం.. పూర్వకాలంలో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి మూడుసార్లు జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించాయట. దీనివల్ల ఆలయానికి, నగరానికి నష్టం వాటిల్లింది. సముద్రుడిని అదుపు చేసే బాధ్యతను జగన్నాథుడు తన పరమ భక్తుడైన హనుమంతుడికి అప్పగించాడు. తీరంలో ఉండి సముద్రం లోపలికి రాకుండా కాపలా కాయమని ఆజ్ఞాపించాడు.
భక్తుడిపై భగవంతుడి సంకెళ్లు
హనుమంతుడు కాపలా ఉన్నంత సేపు సముద్రుడు శాంతంగా ఉండేవాడు. కానీ, హనుమంతుడికి తన స్వామి అయిన జగన్నాథుడిని, బలభద్ర, సుభద్రలను చూడాలనే కోరిక కలిగేది. అర్ధరాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా హనుమంతుడు గర్భాలయంలోకి వెళ్లేవాడు. హనుమంతుడు తన స్థానాన్ని వదిలి వెళ్ళగానే, సముద్రుడు ఆయన వెంటే నగరంలోకి ప్రవేశించేవాడు.
ఈ విషయాన్ని గమనించిన జగన్నాథుడు, హనుమంతుడు తన స్థానాన్ని వదిలి వెళ్లకుండా ఉండేందుకు ఆయన చేతులకు, కాళ్లకు బంగారు గొలుసులతో బంధించాడట. అందుకే ఈ ఆలయానికి బేడి (సంకెళ్లు) హనుమాన్ అనే పేరు వచ్చింది.
ఆలయ విశేషాలు - నిర్మాణం
సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం చాలా ప్రశాంతంగా, చిన్నదిగా ఉన్నా ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఇక్కడి హనుమంతుడు కుడి చేతిలో గదను, ఎడమ చేతిలో లడ్డూను పట్టుకుని దర్శనమిస్తాడు. ఆలయ దక్షిణ గోడపై వినాయకుడి విగ్రహం, పశ్చిమ గోడపై హనుమంతుడి తల్లి అంజనా దేవి విగ్రహం చెక్కబడి ఉన్నాయి.
ఉత్తర గోడపై వివిధ దేవతా మూర్తుల చిత్రాలు భక్తులను ఆకట్టుకుంటాయి. నేటికీ లక్షలాది మంది భక్తులు పూరీ సందర్శనకు వచ్చినప్పుడు, సముద్రుడిని శాంతింపజేస్తూ బందీగా మారిన ఈ వింత హనుమంతుడిని దర్శించుకుని పునీతులవుతుంటారు.