Ramlila: రావణుడి కథతో మొదలైన రామలీలా.. 31 రోజుల పాటు వేడుకలు
వేడుకలు
Ramlila: రామాయణంలోని కథ మరోసారి కళ్లముందు కనిపించనుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని రామ్‌నగర్‌లో 31 రోజుల పాటు జరిగే ప్రసిద్ధ రామలీలా తాజాగా ప్రారంభమైంది. ఈ ఏడాది ఉత్సవాల్లో తొలి రోజు రావణుడి కథతో కార్యక్రమాలు మొదలయ్యాయి.
రావణుడు బ్రహ్మ నుంచి వరం పొందిన తర్వాత అతడి అహంకారం ఎలా పెరిగింది? దేవతలు, రుషులను ఎలా ఇబ్బంది పెట్టాడు? అతడి ఆగడాలను ఆపేందుకు శ్రీమహావిష్ణువు రాముడిగా అవతరించేందుకు ఎలా సిద్ధమయ్యాడు? వంటి ఘట్టాలను తొలి రోజు ప్రదర్శించారు.
ఈ రామలీలాకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. 1830 ప్రాంతంలో కాశీ మహారాజు ఉధిత్ నారాయణ్ సింగ్ ఆధ్వర్యంలో ఇది మొదలైనట్లు సమాచారం. దాదాపు 10 కిలోమీటర్ల పరిధిలోని పలు ప్రాంతాలను అయోధ్య, జనకపురి, చిత్రకూట్, లంక వంటి ప్రదేశాలుగా మార్చి ప్రదర్శనలు నిర్వహిస్తారు.
ఈ రామలీలా ప్రత్యేకత ఏంటంటే.. సాధారణ నాటకాల మాదిరిగా పెద్ద స్టేజ్, మైకులు, ఆధునిక లైట్లు ఉండవు. కళాకారులు సహజంగా తమ మాటలను చెబుతూ రామచరితమానస్‌లోని ఘట్టాలను ప్రదర్శిస్తారు. ఈ సంప్రదాయానికి యునెస్కో గుర్తింపు కూడా ఉంది.