TTD: శ్రీవారి ఆలయ గోపురంపై విగ్రహానికి మరమ్మతులు.. సోషల్ మీడియాలో ప్రచారంపై టీటీడీ క్లారిటీ
సోషల్ మీడియాలో ప్రచారంపై టీటీడీ క్లారిటీ
TTD: తిరుమల శ్రీవారి ఆలయ మహా గోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి మరమ్మతులు చేస్తున్న విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనిపై టీటీడీ స్పందిస్తూ అసలు విషయం ఏంటో వివరించింది. వాస్తవాలు తెలుసుకోకుండా ఆలయ పవిత్రతకు సంబంధించిన అంశాలపై దుష్ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేసింది.
శ్రీవారి ఆలయ మహా గోపురంపై వందలాది విగ్రహాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఎండ, వర్షాలకు ఇవి గురవుతుండటంతో కొన్ని విగ్రహాలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు అవసరం అవుతుంటాయి.
ప్రతి ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులను టీటీడీ చేపడుతుంది. ఈ పనులు జరుగుతున్న సమయంలో గోపురంపై ఉన్న విగ్రహాల పరిస్థితిని కూడా అధికారులు పరిశీలిస్తారు.
ఏదైనా విగ్రహానికి మరమ్మతులు అవసరమైతే వాటిని సరిచేయడం, మరమ్మతులు చేయడం సాధ్యం కాని పరిస్థితి ఉంటే వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ఏర్పాటు చేయడం టీటీడీ ఎప్పటి నుంచో చేపడుతున్న ప్రక్రియలో భాగమేనని తెలిపింది.
ఇదే క్రమంలో ప్రస్తుతం ఆలయ గోపురానికి పెయింటింగ్, మరమ్మతుల పనులు జరుగుతున్న సమయంలో *శ్రీకృష్ణుడి విగ్రహానికి కూడా మరమ్మతులు అవసరమని అధికారులు గుర్తించారు.* వెంటనే సంబంధిత అధికారులు అవసరమైన చర్యలు చేపట్టారని టీటీడీ వెల్లడించింది.
అయితే ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని టీటీడీ పేర్కొంది. ఇలాంటి ప్రచారంతో భక్తుల్లో అనవసరమైన అనుమానాలు, ఆందోళనలు కలిగే అవకాశం ఉందని తెలిపింది.
ఆలయ పవిత్రతకు సంబంధించిన విషయాల్లో వాస్తవాలను తెలుసుకోకుండా దుష్ప్రచారం చేయవద్దని టీటీడీ భక్తులకు సూచించింది. శ్రీవారి ఆలయానికి సంబంధించిన అంశాలపై అపోహలు సృష్టించేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సరికాదని స్పష్టం చేసింది.