Shakuni’s Master Plan: పాచికల వెనుక ప్రతికారం: కురువంశ వినాశనానికి శకుని వేసిన మాస్టర్ ప్లాన్!
కురువంశ వినాశనానికి శకుని వేసిన మాస్టర్ ప్లాన్!
Shakuni’s Master Plan: మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే విలన్ శకుని. కేవలం జూదగాడిగానే మనకు తెలిసిన శకుని వెనుక ఒక భయంకరమైన ప్రతిజ్ఞ ఉంది. గాంధార దేశపు యువరాజు అయిన శకుని, తన సోదరి గాంధారిని ఒక గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేకపోయినా విధిలేక అంగీకరించాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల తన కుటుంబం మొత్తం కౌరవుల చేతిలో బందీగా ఉండి, ఆకలితో చనిపోవాల్సి వస్తుంది. తన కళ్ల ముందే తన తండ్రి, సోదరులు ప్రాణాలు విడవడం చూసిన శకుని, కురు వంశాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తానని శపథం చేశాడు. ఆ కసితోనే తన తండ్రి వెన్నెముకతో చేసిన పాచికలను పట్టుకుని హస్తినాపురంలో అడుగుపెట్టాడు.
శకుని ప్లాన్ చాలా సింపుల్ కానీ చాలా పవర్ ఫుల్. కౌరవులపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూనే, వారిలో అహంకారాన్ని, అసూయను నూరిపోయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా దుర్యోధనుడి మనసులో పాండవుల పట్ల విషాన్ని నింపాడు. "నీ రాజ్యం నీది, పాండవులకు వాటా ఎందుకు?" అంటూ ప్రతి అడుగులోనూ అతడిని రెచ్చగొట్టాడు. దుర్యోధనుడికి శకుని ఒక మేనమామలా కాకుండా, ఒక 'పొలిటికల్ అడ్వైజర్' లా మారిపోయాడు. తన మాటలతో ధృతరాష్ట్రుడిని గుడ్డివాడిని చేశాడు, దుర్యోధనుడిని మూర్ఖుడిని చేశాడు. పాండవులను అంతం చేయడానికి 'లాక్షాగృహం' వంటి కుతంత్రాల వెనుక మాస్టర్ మైండ్ శకునిదే.
మహాభారత కథలో అతి పెద్ద మలుపు 'మాయా జూదం'. యుద్ధం చేసి పాండవులను గెలవడం కష్టమని తెలిసిన శకుని, తనకున్న జూద విద్యను ఆయుధంగా మార్చుకున్నాడు. ధర్మరాజు బలహీనతను ఆసరాగా చేసుకుని, అక్రమ మార్గంలో పాండవుల రాజ్యాన్ని, సంపదను, చివరకు వారి భార్య ద్రౌపదిని కూడా పణంగా పెట్టేలా చేశాడు. సభలో ద్రౌపదికి జరిగిన అవమానం కౌరవుల పతనానికి పునాది వేసింది. నిజానికి శకుని ఉద్దేశం పాండవులను గెలిపించడం కాదు, కౌరవులను తప్పు దారిలో నడిపించి సర్వనాశనం చేయడం. ఆ జూదం వల్లే కురుక్షేత్ర యుద్ధానికి బీజం పడింది.
చివరగా కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. శకుని అనుకున్నట్టే కురు వంశం అంతమైపోయింది. తన పగను తీర్చుకోవడానికి శకుని ఎంచుకున్న మార్గం అధర్మమైనది కావచ్చు, కానీ తన కుటుంబాన్ని నాశనం చేసిన వారిపై అతను సాధించిన విజయం అది. యుద్ధం చివరిలో సహదేవుడి చేతిలో శకుని హతమయ్యాడు. కానీ అప్పటికే తను అనుకున్న 'మాస్టర్ ప్లాన్' అమలై, హస్తినాపురం స్మశానవాటికగా మారిపోయింది. శకుని పాత్ర మనకు నేర్పే పాఠం ఏంటంటే.. పగ మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుంది మరియు ఒకరి చేసిన తప్పుకు వంశాలే బలైపోతాయి.