Sabarimala Devotees Alert: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అత్యంత విశిష్టమైన పడి పూజ నిర్వహణ, బుకింగ్ ప్రక్రియపై ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆలయంలో ఇప్పటివరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ, ఇకపై ప్రతిరోజూ ఐదు పడి పూజలు నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తుల పూజలు పూర్తిగా ముగిసిన తర్వాతే కొత్త బుకింగ్‌లను అనుమతించనున్నారు. ప్రస్తుత రికార్డుల ప్రకారం 2040 సంవత్సరం వరకు దాదాపు 705 మంది భక్తులు పడి పూజ కోసం రిజర్వ్ చేసుకున్నారు. ఈ జాబితాను పూర్తిగా డిజిటలైజ్ చేయడంతో పాటు, దురదృష్టవశాత్తు మరణించిన భక్తుల పేర్లను రద్దు చేసి వెయిటింగ్ లిస్ట్‌ను క్రమబద్ధీకరించనున్నారు. ప్రస్తుతం పడి పూజ రుసుము రూ. 1,37,900గా ఉండగా, ప్రధాన మండల-మకరవిళక్కు సీజన్‌లో మాత్రం ఈ ప్రత్యేక పూజలను నిర్వహించబోమని స్పష్టం చేశారు.

పడి పూజ విశిష్టత ఏమిటి?

శబరిమలలో పడి అనగా మలయాళంలో మెట్టు అని అర్థం. సన్నిధానం ఎదుట ఆధ్యాత్మిక తత్వానికి, 18 ధర్మ సూత్రాలకు ప్రతీకలుగా నిలిచే పరమ పవిత్రమైన పదినెట్టాంబడి (18 బంగారు మెట్లు)కి శాస్త్రోక్తంగా నిర్వహించే అత్యంత పవిత్ర క్రతువే ఈ పడి పూజ.

అరవణ ప్రసాదం కొరతకు చెక్ – భారీగా పెరగనున్న ఉత్పత్తి

తీర్థయాత్రల సమయంలో భక్తులకు అరవణ పాయసం కొరత రాకుండా దేవస్థానం బోర్డు పటిష్ట చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రోజుకు 2 లక్షల నుంచి 2.25 లక్షల టిన్నుల అరవణ ఉత్పత్తి అవుతుండగా, ఈ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు సరికొత్త పరికరాలను సమకూర్చుతోంది. ప్రస్తుతమున్న ప్లాంట్లకు అదనంగా మరో 6 సరికొత్త ఉత్పత్తి యూనిట్లు, 2 కూలింగ్ ఛాంబర్లు, ఒక నూతన బాయిలర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

మౌలిక సదుపాయాలు – కోర్టు ఆదేశాలు

యాత్రికుల రాకపోకలు సులభతరం చేసేందుకు చాలకాయం-పంబ ప్రధాన రహదారి అభివృద్ధి పనుల నిమిత్తం దేవస్వోమ్ బోర్డు రూ. 15 కోట్లను కేటాయించింది. కొప్రక్కలం పరిసరాల్లోని అక్రమ దుకాణాన్ని తక్షణమే తొలగించాలని హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. శబరిమలలో నూతన అన్నదాన భవనం నిర్మాణం పూర్తయినప్పటికీ, దానిని ఇంకా భక్తుల వినియోగానికి ఎందుకు ప్రారంభించలేదో సమగ్ర వివరణ ఇవ్వాలని న్యాయస్థానం బోర్డును ఆదేశించింది.

Tags: