Sri Prasanna Venkateswara Swamy Pavitrotsavams: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అక్టోబ‌రు 6 నుండి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలకు సోమ‌వారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. ఈ సందర్భంగా మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు.

వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో వేదపఠనం, ఆలయశుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పవిత్రోత్సవాల్లో మొదటి రోజైన అక్టోబ‌రు 6న‌ పవిత్ర ప్రతిష్ఠ, అక్టోబ‌రు 7న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు చేపడతారు. చివరిరోజు అక్టోబ‌రు 8న మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జ‌రుగ‌నుంది. ప‌విత్రోత్స‌వాల సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఉత్స‌వ‌ర్ల‌కు స్నపన తిరుమంజనం నిర్వ‌హిస్తారు.

ఈ సందర్భంగా ప్రతిరోజూ టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో హరికథా పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో ఆల‌య ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్‌ శ్రీమ‌తి శ్రీ‌వాణి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ వేణుగోపాల్‌, ఆలయ అర్చకులు శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: